ఇంకుతున్న చెరువులు.. ఎండుతున్న పంటలు

ఇంకుతున్న చెరువులు.. ఎండుతున్న పంటలు

వనపర్తి జిల్లాలో యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండుతున్నాయి. వానకాలంలో కల్వకుర్తి లిఫ్ట్​ ద్వారా చెరువులను నింపారు. కానీ కొన్ని రోజులుగా లిఫ్టు ద్వారా నీరు రాకపోవడంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ఎండలు ముదురుతుండడంతో చెరువుల్లో నీరు ఇంకి పోతోంది. వరి చివరి దశలో ఉండగా, నీరందక వడ్లు తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దమందడి మండలం అల్వాల, మద్దిగట్ల హమ్మద్ హుస్సేన్, అమ్మపల్లి అమ్మ చెరువులు ఎండిపోయాయి. 

కనీసం మూగజీవాలకు కూడా తాగునీరు కరువైంది. వనపర్తి, పెద్దమందడి, పానగల్, ఆత్మకూరు,అమరచింత, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో 10 వేల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయి. నీళ్లు లేక బోర్లు వట్టిపోతున్నాయి. ఇక ఆత్మకూరు, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, వీపనగండ్ల, పానగల్  మండలాల్లో చివరి ఆయకట్టు భూములకు ఎడమ కాలువ ద్వారా వారానికోసారి నీళ్లు అందిస్తున్నారు. దీంతో నీళ్ల కోసం రైతులు గొడవలకు దిగుతున్నారు. - వనపర్తి, వెలుగు: