కొన్ని రోజులుగా కరెంట్ కోతలు నిజమే : జగదీష్ రెడ్డి

కొన్ని రోజులుగా కరెంట్ కోతలు నిజమే : జగదీష్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కొన్ని రోజులు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన మాట నిజమేనని, ఇప్పుడు 24 గంటల కరెంట్ పునరుద్ధరించామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ‘‘శుక్రవారం నుంచి ఎలాంటి కోతలు లేకుండా 24 గంటల కరెంట్ పునరుద్ధరించాం” అని తెలిపారు. కరెంట్ కోతలపై శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘కొంత కోత పెడితేనే కోతికి కొబ్బరికాయ దొరికినంత సంతోషపడ్డారు. మళ్లీ వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది” అని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ‘‘రాష్ట్రంలో ఇయ్యాల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. పోయినేడాది మార్చి 29న 14,166 మెగావాట్లు నమోదైతే, ఇప్పుడు దాన్ని అధిగమించి 14,169 మెగావాట్లు నమోదైంది. ఇంకో వెయ్యి మెగావాట్ల వరకు డిమాండ్​పెరిగే చాన్స్​ఉంది. అయినా అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తాం” అని చెప్పారు. సీఎం కేసీఆర్ కు రైతులను దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ వల్లే కరెంట్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రానికి సప్లై చేస్తున్న రెండు విద్యుత్ కేంద్రాలు ట్రిప్ కావడంతో 1,200 మెగావాట్ల సప్లై ఆగిపోయిందని పేర్కొన్నారు. ‘‘దేశ ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒకరేమో ప్రగతి భవన్​ను కూలగొడుతాం అంటరు.. ఒకరు సెక్రటేరియేట్​కూలగొడుతాం అంటరు. వాళ్లు ప్రజల బతుకులు కూలగొట్టెటోళ్లు.. సీఎం కేసీఆర్ నిర్మించేటోళ్లు” అని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్​గా విద్యుత్​ కొనుగోలు చేయలేదని తెలిపారు. మంత్రి జిల్లాలోనే రైతులు ధర్నా చేసిన్రు: భట్టి 
కరెంట్​కోతలపై మంత్రి జగదీశ్ రెడ్డి జిల్లాలోనే రైతులు సబ్​స్టేషన్లను ముట్టడించి, ధర్నాలకు దిగారని సీఎల్పీ నేత భట్టి అన్నారు.‘‘నకిరేకల్​మండలంలో మర్రూర్​ సబ్​స్టేషన్​ను రైతులు ముట్టడించారు. నార్కట్​పల్లి–అద్దంకి హైవేపై తిప్పర్తి రైతులు ధర్నా చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్​ ఇవ్వడం లేదు” అని అన్నారు.