కరెంట్.. ఇక స్మార్ట్! ఎక్కడ, ఏ మూల సమస్య వచ్చినా తెలిపే ఎఫ్ఓఎంఆర్ సిస్టమ్..

కరెంట్.. ఇక స్మార్ట్! ఎక్కడ, ఏ మూల సమస్య వచ్చినా తెలిపే ఎఫ్ఓఎంఆర్  సిస్టమ్..
  • ప్రతి డిస్ట్రిబ్యూషన్  ట్రాన్స్​ఫార్మర్​కు స్మార్ట్  మీటర్
  • ఇండస్ట్రీలకు ఆటోమేటిక్  మీటర్  రీడింగ్ ఏర్పాటు
  • విద్యుత్  వ్యవస్థలో కొత్త విప్లవం


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్  వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్  మీటర్లు, ఆటోమేటిక్  మీటర్  రీడింగ్, ఫీడర్  ఔటేజ్  మేనేజ్ మెంట్  సిస్టమ్ (ఎఫ్ఓఎంఎస్), ఈ-స్టోర్స్, అండర్‌‌గ్రౌండ్  కేబుల్ వ్యవస్థ వంటి అత్యాధునిక సాంకేతికతలతో విద్యుత్  సరఫరాను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో కొత్త సబ్‌‌స్టేషన్ల నిర్మాణంతో డిమాండ్‌‌కు తగ్గట్టు సరఫరాను సమతుల్యం చేయనుంది.

విద్యుత్  నష్టాలకు చెక్

విద్యుత్  సరఫరాలో సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్  పంపిణీ సంస్థ  అత్యాధునిక ఫీడర్ ఔటేజ్  మేనేజ్ మెంట్  సిస్టమ్ ను అమలు చేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా 11 కేవీ ఫీడర్లలో ఏర్పడే లోపాలను ఆటోమేటిక్‌‌గా గుర్తించి, జీఐఎస్  డేటా ఆధారంగా సంబంధిత అసిస్టెంట్  ఇంజనీర్లకు ఎస్ఏఎస్​ఏ యాప్  ద్వారా బజర్  సౌండ్‌‌తో అప్రమత్తం చేస్తుంది. దీంతో టెక్నీషియన్లు సకాలంలో సమస్య ఉన్న ప్రాంతానికి చేరుకొని విద్యుత్  సరఫరాను పునరుద్ధరిస్తారు. ఈ సాంకేతికతను సదరన్ ​ డిస్కం పరిధిలోని 8,621 ఫీడర్లలో (జీహెచ్ఎంసీ పరిధిలో 3412, గ్రామీణ ప్రాంతాల్లో 5,209) అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఫీడర్  ట్రిప్‌‌ల కారణాలు, పునరుద్ధరణ సమయం వంటి వివరాలను ఉన్నత స్థాయి అధికారులు, సీఎండీ స్థాయి అధికారులు  రియల్  టైమ్‌‌లో పర్యవేక్షించవచ్చు.

పారదర్శకంగా బిల్లింగ్..

ఎలక్ట్రిసిటీ థెఫ్ట్​ (చౌర్యాన్ని) ను అరికట్టేందుకు పారిశ్రామిక, హైటెన్షన్ (హెచ్ టీ), వాణిజ్య వినియోగదారులకు ఆటోమేటిక్  మీటర్  రీడింగ్ (హెచ్​టీ ఏఎంఆర్​) టెక్నాలజీతో స్మార్ట్  మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటర్లు ప్రతి సెకనుకు విద్యుత్  వినియోగ డేటాను రికార్డు చేసి, బిల్లింగ్‌‌ను మొబైల్, ఈ -మెయిల్ ద్వారా వినియోగదారులకు అందజేస్తాయి. ఈ వ్యవస్థ ద్వారా బిల్లింగ్‌‌లో  మ్యానువల్​గా అవకతవకలను నివారించడమే కాక, సబ్‌‌స్టేషన్లలో లోడ్ ప్లానింగ్‌‌  కూడా చేయవచ్చు.  అలాగే 1,55,000 డిస్ట్రిబ్యూషన్  ట్రాన్స్‌‌ఫార్మర్లకు స్మార్ట్  మీటర్లను అమర్చాలని డిస్కం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి స్మార్ట్​ మీటర్ల వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.

ఈ - స్టోర్స్‌‌తో సామగ్రి కొనుగోళ్లలో పారదర్శకత

విద్యుత్  సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలను నివారించేందుకు ఈ-స్టోర్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా అవసరమైన సామగ్రిని మాత్రమే కొనుగోలు చేసి, నిర్వహణ ఖర్చులను తగ్గించనున్నారు. స్మార్ట్  మీటర్లు, అండర్‌‌గ్రౌండ్  కేబుల్స్, స్కాడా టెక్నాలజీ, కొత్త సబ్‌‌స్టేషన్లు, సోలార్  ప్లాంట్ల ఏర్పాటు వంటి సంస్కరణలతో తెలంగాణ విద్యుత్  రంగం ఆర్థికంగా బలోపేతం కానుంది. ఈ చర్యలు విద్యుత్ నష్టాలను తగ్గించడమే కాక, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపనున్నాయి.

కొత్త సబ్‌‌స్టేషన్లు, అండర్‌‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ

విద్యుత్  డిమాండ్‌‌ను తట్టుకునేందుకు ఒక్క సదరన్  డిస్కం పరిధిలోనే 298 కొత్త సబ్‌‌స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో 70 శాతం సబ్‌‌స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయనున్నారు, మిగిలినవి మూడేళ్లలో కంప్లీట్  చేయనున్నారు. సదరన్​ డిస్కం పరిధిలోని మేడ్చల్ జోన్‌‌లో విద్యుత్ డిమాండ్  ఏటా 25- నుంచి 30 శాతం పెరుగుతున్న నేపథ్యంలో మేడ్చల్, హబ్సిగూడ, సంగారెడ్డి సర్కిళ్లలో సమ్మర్  యాక్షన్  ప్లాన్‌‌ను అమలు చేస్తున్నారు. 

అలాగే గ్రేటర్  హైదరాబాద్, ఫ్యూచర్  సిటీ, ఔటర్  రింగ్  రోడ్ (ఓఆర్ఆర్), ట్రిపుల్  ఆర్ పరిధిలో 2,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అండర్‌‌  గ్రౌండ్  విద్యుత్  కేబుల్  వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు  746 స్క్వేర్​ కిలోమీటర్లతో బెంగుళూరులోఉన్న యుజీ కేబుల్​ దేశంలోనే నంబర్​ వన్​గా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.