ట్విట్టర్ v/s థ్రెడ్స్​... నువ్వా? నేనా?

ట్విట్టర్ v/s థ్రెడ్స్​... నువ్వా? నేనా?

ప్రస్తుతానికి ట్విట్టర్​, మెటాల మధ్య అలాంటి వార్​ నడుస్తోంది. ఎలాన్​ మస్క్​ ట్విట్టర్​కు పోటీగా జుకర్​బర్గ్​ మెటా నుంచి థ్రెడ్స్​ అనే కొత్త మైక్రోబ్లాగింగ్​ యాప్​ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్​ రావడం ఆలస్యం ఇప్పటివరకు వచ్చిన యాప్​లను మించి క్రేజ్​ తెచ్చుకుంది. యాప్​స్టోర్​​, ప్లేస్టోర్​ల్లోకి విడుదలచేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ల మంది యూజర్లు థ్రెడ్స్​కి సబ్​స్క్రయిబ్​ అయ్యారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఎలాన్​ మస్క్​కి మాత్రం విపరీతమైన కోపం వచ్చేసింది. ‘‘నా కంపెనీలో ఉద్యోగులను మెటాలో ఉద్యోగంలోకి తీసుకుని ఈ థ్రెడ్స్​ యాప్​ తయారుచేయించారు. మా దగ్గర నుంచి వెళ్లిపోయిన ఉద్యోగులకు ట్విట్టర్​కు సంబంధించి బోలెడు విషయాలు తెలుసు. ఇలా చేయడం ఇల్లీగల్​” అని కేసు వేసేశాడు. ఆ వివరాలను పక్కనపెడితే. అసలు ట్విట్టర్​, థ్రెడ్స్​కి ఉన్న పోలికలు ఏంటి? ఈ కొట్టుకోవడం ఎందుకు? వంటి విషయాల గురించి చెప్పేదే ఈ స్టోరీ.

ఫేస్​బుక్​ ఓనర్​ మెటా థ్రెడ్స్​ అనే యాప్​ను ఈ నెల 6వ తేదీన  సోషల్​ మీడియా మార్కెట్​లోకి తెచ్చింది. దీని లోగో స్ట్రక్చర్​ ట్విట్టర్​లా ఉన్నా, ఇన్​స్టాగ్రామ్​లో ఉన్న ఫీచర్స్​  థ్రెడ్స్​లో నింపుకుంది. అయితే ఇది కొత్తదేం కాదు ట్విట్టర్​కు క్లోన్​లా ఉందంటున్నాడు ఎలాన్​ మస్క్​. మన చేతిలో స్మార్ట్​ఫోన్​ ఉంది కాబట్టి ఈ గొడవలో మనకు తెలియకుండానే భాగస్వాములం అయిపోయాం. ఎందుకంటే ఇదివరకటిలా మామూలు ఫోన్​ చేతిలో ఉంటే కాల్స్​ చేసుకుని, అవసరమైనప్పుడు మెసేజ్​లు పెట్టి చప్పుడు చేయకుండా ఉండేవాళ్లం. కానీ ఇప్పడు అలా లేదు కదా! 
నిజానికి ఎలాన్​ మస్క్​ ట్విట్టర్​ను తీసుకున్నప్పటినుంచీ ఏవేవో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ఆయన అనుకున్నట్టు అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే ట్విట్టర్​ డిజిటల్​ పేమెంట్స్​ ప్లాట్​ఫాంగా మారిపోతుంది కూడా. కానీ మధ్యలో జుకర్​ బర్గ్​ వచ్చి ట్విట్టర్​ పిట్టకు థ్రెడ్స్​ అనే దారం వేసి వెనక్కి లాగినట్టు అయింది. దాంతో ఎలాన్​ మస్క్​(ట్విట్టర్​, టెస్లా, స్పేస్​ ఎక్స్​, స్టార్​లింక్​ ​) వర్సెస్​ జుకర్​బర్గ్​ (ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్,​ వాట్సాప్​)ల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. కారణం వాళ్లు తయారుచేసి జనాల మీదకు వదిలిన సోషల్ ప్రొడక్ట్స్​ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మిలియన్ల మంది వాడుతుండటమే. అందుకే వాళ్లిద్దరి మధ్య యుద్ధం అల్లాటప్పాగా ఆగిపోయేలా లేదు.

థ్రెడ్స్​ అంటే...

థ్రెడ్స్​ అనేది మైక్రోబ్లాగింగ్​ యాప్​. మెటా (ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ ) ఐఓఎస్​ (యాప్​ స్టోర్​), ఆండ్రాయిడ్​ (ప్లే స్టోర్​) డివైజ్​లకు అందుబాటులోకి తెచ్చింది. ఇన్​స్టాగ్రామ్​లో చేసినట్టే థ్రెడ్స్​లో కూడా పోస్ట్​ చేయొచ్చు. మీరు ఫాలో అవుతున్న అకౌంట్ల థ్రెడ్స్​కు రెస్పాండ్​ కావొచ్చు. నచ్చిన ప్రొఫైల్​ను ఫాలో కావచ్చు. షార్ట్​ టెక్స్ట్​ మెసేజ్​లు, లింక్స్​, ఫొటోలు, వీడియోలు లేదా వీటిలో ఏ కాంబినేషన్​ అయినా చేసుకోవచ్చు. అకౌంట్​ ఫాలో అయ్యేవాళ్లు థ్రెడ్స్​ చూడొచ్చు.... ఇలా సోషల్​ మీడియాలో టెక్స్ట్​ బేస్డ్ ​​ ఇంటరాక్షన్​కు అవసరమైన ఆప్షన్స్​ అన్నీ ఉన్నాయి. 

ట్విట్టర్​ కిల్లర్​?

ఇందులో ట్విట్టర్​కు పోటీ ఏముంది అంటున్నారా? ఎందుకంటే థ్రెడ్స్​లో ఉన్న ఫీచర్లు, థ్రెడ్స్​ లోగో స్ట్రక్చర్​  ట్విట్టర్​లా కనిపిస్తున్నాయి కాబట్టి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్విట్టర్​ను కండెన్స్​ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది థ్రెడ్స్​. అయితే ఇంతకుముందు కూడా ట్విట్టర్​కి ప్రత్యామ్నాయంగా చాలానే యాప్స్​ వచ్చాయి. అవి... క్లబ్​ హౌస్​(ఏప్రిల్​ 2020. పది మిలియన్ల యూజర్లు), కౌంటర్​సోషల్​ (2017 నవంబర్​, 62 మిలియన్ల యూజర్లు), డిస్​కార్డ్​ (2015 మే. 140 మిలియన్ల యూజర్లు), లింక్డిన్ (2003 మే. 930 మిలియన్ల యూజర్లు), మాస్టోడాన్​ (2016, మార్చి. 2.6 మిలియన్ల యూజర్లు), రెడ్డిట్​ (2005. 52 మిలియన్ల యూజర్లు), టంబ్లర్​ (2007 ఫిబ్రవరి, 547 మిలియన్ల యూజర్లు), డబ్ల్యుటి.సోషల్​(2019 డిసెంబర్​. 508,980). ఇవన్నీ ఇండైరెక్ట్​గా ట్విట్టర్​తో పోటీ పడితే... మెటా సీఈఓ జుకర్​ బర్గ్​ తెచ్చిన థ్రెడ్స్​ మాత్రం ట్విట్టర్​తో నేరుగా ఢీ కొట్టింది. దాదాపు పదకొండేండ్ల తరువాత ఫేస్​బుక్​ బాస్...​ ఎలాన్​మస్క్​ మైక్రో బ్లాగింగ్​ ట్విట్టర్​కు గట్టి పోటీ ఇచ్చాడు అనుకుంటున్నారు కొందరు టెక్​ ఎక్స్​పర్ట్స్​. ట్విట్టర్​కు డిసెంబర్​ 2022 వరకు నెలకు368 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

థ్రెడ్స్​ యూజర్స్​ ఇవి చేయొచ్చు

థ్రెడ్స్​ వాడేవాళ్లు పోస్ట్​లకు లైక్​, కామెంట్​, షేర్​ చేయొచ్చు. అలాగే ఇన్​స్టాగ్రామ్​లో ఉన్న ప్రొఫైల్​ పేర్ల​నే ఇక్కడా వాడొచ్చు. థ్రెడ్స్​ వాడేవాళ్లకు వాళ్ల ఇన్​స్టాగ్రామ్​ యూజర్​పేరు, బయో, ఫాలోవర్స్​ను  లింక్​ చేయడం ఈజీ. ఈ కొత్త యాప్​కు బిగ్గెస్ట్​ ప్లస్​ పాయింట్​ ఇది. ట్విట్టర్​లో లాగా థ్రెడ్స్​కి హ్యాష్​ట్యాగ్స్ అవసరంలేదు. అయితే థ్రెడ్స్​లో సైనప్​ చేయాలంటే ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ సైనప్​ చేయాల్సిందే. ఈ ఒక్క విషయం చాలు సోషల్​ బిజినెస్​ గేమ్​లో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు. ‘‘ట్విట్టర్​ నుంచి జనాల కళ్లు తమవైపు తిప్పుకునేందుకు చేసిన అతిపెద్ద స్టెప్​ ఇది. ముందు ముందు  థ్రెడ్స్​ ట్విట్టర్​కు గట్టిపోటీ ఇస్తుంది’’ అంటున్నారు టెక్​ ఎక్స్​పర్ట్స్​. ​ ట్విట్టర్​ను మస్క్44 బిలియన్​ డాలర్లు ఖర్చుపెట్టి సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత దానిలో మార్పులు చేర్పులు చేసేందుకు చాలా కష్టపడ్డాడు ఈ బిలియనీర్​. తను పగ్గాలు చేపట్టగానే ఉద్యోగులను తగ్గించాడు. పాలసీలు మార్చాడు. దానివల్ల ట్విట్టరకు లాయల్​ యూజర్స్​గా ఉన్న వాళ్లను కూడా కోల్పోయాడు.

ప్రెట్టియర్​ ట్విట్టర్​

ఇప్పటివరకు థ్రెడ్స్​ యాప్​ వాడిన వాళ్ల రెస్పాన్స్​ బాగుందని ఆ కంపెనీ చెప్తోంది.  ‘‘ఇది ప్రెట్టియర్(సొగసైన)​ ట్విట్టర్​’’ అని కామెంట్​ చేశాడు ఒక యూజర్​. ‘‘ఇన్​స్టాగ్రామ్​తో ఇంటిగ్రేషన్​ బాగుంది. కాకపోతే మరికొన్ని ఫీచర్స్​ థ్రెడ్స్​కు యాడ్​ చేయాలి”అని మరో యూజర్​ కామెంట్​. ట్వీట్​ డెక్​ వంటి ట్విట్టర్​ థర్డ్​ పార్టీ అప్లికేషన్​ థ్రెడ్స్​లో లేదు. అవసరమైన అప్​డేట్స్​ మాత్రమే రిసీవ్​ చేసుకునే అవకాశం కూడా లేదు.

ఆల్ రికార్డ్స్ బ్రేక్

థ్రెడ్స్.. సోషల్​ మీడియాలో వచ్చిన కొత్త యాప్. నిజానికి ఇది పేరుకు మాత్రమే కొత్తది అని చెప్పాలేమో! ఎందుకంటే ఇది లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డ్​ లెవల్లో డౌన్​లోడ్స్​ అయ్యాయి. సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్న, ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​ వాడుతున్న వాళ్లలో దాదాపు అందరూ థ్రెడ్స్​ యూజర్లు అయిపోయారు. మిలియన్ల కొద్దీ డౌన్​లోడ్​లు అవ్వడమంటే నిజంగా రికార్డే. ఎందుకంటే... నెట్​ఫ్లిక్స్ అనేది ఎంత పెద్ద ప్లాట్​ఫామో తెలిసిందే. అలాంటిది దానికి ఒక మిలియన్ యూజర్స్ రావడానికి మూడున్నర ఏండ్లు పట్టింది. ట్విట్టర్​కు రెండేండ్లు, ఫేస్​బుక్​కు పది నెలలు, ఇన్​స్టాగ్రామ్​కి రెండున్నర నెలలు టైం పట్టింది.

 అయితే, వీటన్నింటికీ మించి కేవలం ఐదు రోజుల్లోనే చాట్​జీపీటీ ఒక మిలియన్​ యూజర్లను సంపాదించుకుంది. మరి ఇప్పుడు... దాన్ని తలదన్నేలా థ్రెడ్స్ యాప్ కేవలం ఒకే ఒక్క గంటలో ఒక మిలియన్​ యూజర్లను సంపాదించి రికార్డ్​ బ్రేక్​ చేసింది. అంతేనా...18 గంటల్లో 3 కోట్లు, 24 గంటల్లో 4.4 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీనికి కారణం ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ ఉన్న వాళ్లంతా ఈజీగా థ్రెడ్స్​ యాప్​లోకి సైనప్​ అవ్వచ్చు కాబట్టి. యూజర్ నేమ్ కూడా ఇన్​స్టాదే ఉంటుంది. ఫాలోవర్స్ దీనికి కనెక్ట్​ అయిపోతారు. ఇందులో బయోడేటాను మాత్రం ఎడిట్ చేసే వీలుంది. 

ఇన్​స్టాగ్రామ్​ నుంచి డౌన్​లోడ్

మామూలుగా ఒక యాప్​ డౌన్​లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్​కి వెళ్లి పేరు సెర్చ్​ చేసి డౌన్​లోడ్ చేస్తారు. కానీ, థ్రెడ్స్​ని ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్ ఉన్న వాళ్లు చాలా సింపుల్​గా డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అదెలాగంటే... ఇన్​స్టాగ్రామ్​ ప్రొఫైల్​కి వెళ్లి, కుడివైపు పైన ఉన్న మూడు గీతల్ని ట్యాప్ చేయాలి. అందులో థ్రెడ్స్​ అనే ఆప్షన్​ వస్తుంది. దాని మీద ట్యాప్​ చేయగానే ఒక కార్డ్​​ రొటేట్​ అవుతూ కనిపిస్తుంది. దాని మీద పేరు, క్యూఆర్ కోడ్, డేట్, టైం కనిపిస్తాయి. దాని కింద ‘గెట్ థ్రెడ్స్’ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద నొక్కితే వెంటనే అది గూగుల్ ప్లే స్టోర్​కి రీ–డైరెక్ట్ అవుతుంది. అక్కడ ఇన్​స్టాల్ చేసుకుని, ఓపెన్ చేస్తే ‘లాగిన్​ విత్​ ఇన్​స్టాగ్రామ్​ ఐడీ’ అని కనిపిస్తుంది. ​ఫ్రొఫైల్​లో నేమ్, బయో డేటాతో పాటు లింక్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అదికాకుండా ఇంపోర్ట్ ఫ్రమ్ ఇన్​స్టాగ్రామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద ట్యాప్ చేస్తే ఇన్​స్టాగ్రామ్​లో ఉన్న ఫీడ్ మొత్తం థ్రెడ్స్​లోకి వచ్చేస్తుంది. దాంతోపాటు ఇందులో పబ్లిక్, ప్రైవసీ ప్రొఫైల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఫాలో ఆల్ ఆప్షన్ చూపిస్తుంది. తర్వాత ‘జాయిన్ థ్రెడ్స్’ మీద​ ట్యాప్ చేయాలి. వెంటనే ఫోన్​కి ఓటీపీ వస్తుంది. అందులో ‘అప్రూవ్’ అనే ఆప్షన్ సెలక్ట్ చేస్తే లాగిన్ అయిపోతుంది.                

టాప్​ లిస్ట్​లో ఉన్న యాప్స్ ఇవే

సోషల్ నెట్​వర్కింగ్ ప్లాట్​ఫామ్స్​లో ఫస్ట్​ ప్లేస్​ కోసం పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త యాప్స్ రావడం, యూజర్ల సంఖ్య పెరగడం లేదా తగ్గడం వల్ల లీడర్​ బోర్డ్​లో ప్లేస్​లు మారుతూ ఉంటాయి. అలాగే కొన్ని బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్లకు సెలక్టివ్​ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ని మాత్రమే వాడతారు. దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్​ పడుతుంది. అయితే ఏ ప్లాట్​ఫామ్​ ఏ పొజిషన్​లో ఉంది? అనేది తెలుసుకోవడానికి కొన్ని అంశాలను చూస్తారు. అవి... యాక్టివ్​ యూజర్స్ సంఖ్య, ప్రస్తుతం ఎంతమంది యునిక్​ యూజర్స్ ఆ ప్లాట్​ఫామ్​లో రిజిస్టర్ అయ్యారు? వంటివి. వీటివల్ల టెక్ ఇండస్ట్రీ పాపులారిటీ, ఎంగేజ్​మెంట్​, గ్రోత్​ వంటివి తెలుస్తాయి. 

ఫేస్​ బుక్

ప్రస్తుతం టాప్​లో ఉన్న సోషల్​ మీడియా ప్లాట్ ఫామ్​ ఫేస్​బుక్​. ఇందులో 2.74 బిలియన్ యాక్టివ్​ యూజర్స్​ ఉన్నారు. ఈ యాప్ మొదలుపెట్టినప్పుడు ఇంటర్నెట్​ కనెక్షన్​ కూడా చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉండేది కాదు. స్మార్ట్​ ఫోన్ వాడేవాళ్లు కూడా తక్కువే. పబ్లిక్​ ఇంటరాక్షన్ మీద దెబ్బకొడుతుందనే వాదనలు బాగా వినిపించాయి కూడా. ఇలా రకరకాల సవాళ్లను ఎదుర్కొంది ఫేస్​బుక్. కానీ, దాని ఎదుగుదలను​ మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఆ రోజుల్లోనే కేవలం పది నెలల్లో ఒక మిలియన్​ సబ్​స్క్రయిబర్స్​ని సంపాదించుకుంది. అంతేకాదు.. రోజుకి దాదాపు ఐదు లక్షల మంది కొత్త యూజర్స్ వాడుతున్నారు. 2004లో లాంచ్​​ అయిన ఈ యాప్ ఈ ఏడాది మార్చి నాటికి 2.74 బిలియన్ యాక్టివ్ యూజర్స్​తో ఇప్పటికీ నెంబర్​ వన్​ పొజిషన్​లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఫేస్​బుక్​ వాడేవాళ్లలో 12 నుంచి 34 ఏండ్ల వయసువాళ్లే ఎక్కువ అని అమెరికాకు చెందిన ఒక రిపోర్ట్​ చెప్తోంది. ‘సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఫేవరెట్​ ఏది?’ అని అడిగితే.. 2015లో 58 శాతం మంది ఫేస్​బుక్​కి ఓటేశారు. కానీ, 2020 నాటికి అది 32 శాతానికి తగ్గింది. అందుకు కారణం ‘ఇన్​స్టాగ్రామ్​’.  యాక్టివ్ ఫేస్​బుక్ యూజర్స్ ఉన్న దేశాల్లో 290 మిలియన్స్​తో ఇండియా మొదటి ప్లేస్​లో ఉంది. తర్వాత అమెరికా190 మిలియన్, ఇండోనేసియా140 మిలియన్ యాక్టివ్ యూజర్స్​ని కలిగి ఉంది. 

ఇన్​స్టాగ్రామ్​

ప్రపంచంలోనే పాపులర్ ఫొటో, వీడియో షేరింగ్​ యాప్ ఇన్​స్టాగ్రామ్. గ్లోబల్​గా1.22 బిలియన్​ యాక్టివ్​ యూజర్లతో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఐదో స్థానంలో ఉంది. మొదట్లో దీని గ్రోత్ ఎలా ఉందంటే... 2012లో 35 మిలియన్​ ఉంటే... 2016 నాటికి 500 మిలియన్ యూజర్లకు చేరింది. ఇన్​స్టాగ్రామ్​ అనేది ఎక్కువగా ఇన్​ఫ్లుయెన్సర్స్​ని క్రియేట్ చేయడం ద్వారా వరల్డ్​ డిజిటల్ మార్కెటింగ్​కి కంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే, యాక్టివ్​గా యూజర్ల విషయంలో ఇన్​స్టాగ్రామ్​కి గట్టి పోటీ ఇచ్చేది మాత్రం ఫేస్​బుక్. అలాగే ఇండియా, అమెరికాలో140 మిలియన్ల యూజర్లు ఇన్​స్టా  వాడుతున్నట్లు ఆ రెండు దేశాల నేషనల్ డెమోగ్రాఫిక్స్ చెప్తున్నాయి. 

ట్విట్టర్

బిజినెస్​​ మార్కెటింగ్​కి ఉపయోగపడే ప్లాట్​ఫామ్ ట్విట్టర్​. రీసెంట్​గా చూస్తే 230 మిలియన్ యూజర్లు ప్రతి రోజు యాక్టివ్​గా ఉంటున్నట్లు స్టాటిస్టిక్స్​ చెప్తున్నాయి. ఇందులో బ్రాండ్స్​ ప్రమోట్ చేయడానికి మైక్రోబ్లాగింగ్ పద్ధతి వాడుతున్నారు. దానివల్ల బ్రాండ్స్​ ప్రమోషన్స్ పబ్లిక్​కి బాగా రీచ్​ అవుతున్నాయి. 

ఈ మధ్య చేసిన సర్వే ప్రకారం ట్విట్టర్ యూజర్స్​ అమెరికాలోనే ఎక్కువ ఉన్నారు. అక్కడ 64.6 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. అమెరికాలో చాలా ఫాస్ట్​గా ఎదిగిన సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో  ఒకటి ట్విట్టర్​. ఆ తర్వాత జపాన్​లో 51.8 మిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ రెండు దేశాల్లో కలిపి115 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు ట్విట్టర్​కు. అయితే, ట్విట్టర్​ని వాడే వాళ్లలో మనదేశం15 మిలియన్ల యూజర్లతో ఐదో స్థానంలో ఉంది. 

ఈ లెక్కలన్నీ చూసుకుంటే... ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్ టాప్​లో ఉంది. కాబట్టి థ్రెడ్స్​ కూడా అదే రేంజ్​లో ఉండే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ట్విట్టర్​కు థ్రెడ్స్​ పోటీనే కాదు. అంతేకాదు.. థ్రెడ్స్​లో డెవలప్​ చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి పూర్తిగా డెవలప్​ అయ్యాక అది ఎంతమందికి నచ్చుతుందో చెప్పలేం. నచ్చకపోతే డీ–యాక్టివేట్ చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ట్విట్టర్​ రూల్స్​లో మస్క్​ ఏవైనా మార్పులు చేస్తే, అవి యూజర్లకు నచ్చితే ట్విట్టర్​కు యూజర్స్ పెరిగే అవకాశం ఉంది. పైగా థ్రెడ్స్ డౌన్​లోడ్ చేసుకున్నంత ఈజీగా డిలీట్ చేయలేరు. ఎందుకంటే థ్రెడ్స్ 

తేడాలేంటి? 

మెటా కుటుంబం నుంచి రావడం వల్లే థ్రెడ్స్​కి ఇంత హైప్​ వచ్చినా.. దాంట్లో ఉన్న ఫీచర్స్​ డౌన్​లోడ్స్‌‌ పెరిగేలా చేసింది.16 ఏళ్ల ప్రస్తానం ఉన్న ట్విట్టర్‌‌కి ప్రత్యర్థిగా సోషల్​ మీడియాలోకి అడుగుపెట్టింది థ్రెడ్స్​. అసలు ట్విట్టర్‌‌‌‌, థ్రెడ్స్​ల మధ్య తేడాలేంటి? ఈ రెండు ఒకేలా పనిచేస్తాయా? అంటే...

అవైలబిలిటీ

ట్విట్టర్ సుమారు 16 సంవత్సరాల క్రితం మొదలైనప్పుడు అది కేవలం ఒక వెబ్‌‌సైట్ మాత్రమే. చాలా ప్రజాదరణను పొందింది. తర్వాత స్మార్ట్‌‌ఫోన్​ల వాడకం పెరగడంతో చివరికి ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యాప్​ని తీసుకొచ్చింది. ఇది కూడా చాలా స్పీడ్​గా పాపులర్​ అయ్యింది. కానీ.. థ్రెడ్స్​ అలా కాదు.. యాప్ -మాత్రమే ఉంది. వెబ్​లో వాడుకోవడానికి అవకాశం లేదు. ఇన్‌‌స్టాగ్రామ్ సక్సెస్​తో ఈ యాప్​ని తీసుకొచ్చింది మెటా. కానీ థ్రెడ్స్​ వెబ్‌‌సైట్ తీసుకురాకపోవచ్చు. 

అకౌంట్​ సింక్​

ట్విట్టర్​ ఇండిపెండెంట్​ యాప్​. ఇ–మెయిల్, ఫోన్ నెంబర్ లాంటి డిటెయిల్స్​ ఇచ్చి లాగిన్​ కావొచ్చు. మరే ఇతర యాప్‌‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. కేవలం లాగ్ సమాచారాన్ని మాత్రమే తీసుకుంటుంది. కానీ థ్రెడ్స్​ ఇన్​స్టాగ్రామ్​తో సింక్​ అవుతుంది. ఇన్‌‌స్టాగ్రామ్ అకౌంట్​ లేకుండా  థ్రెడ్స్‌‌లోకి లాగిన్ అవడం కుదరదు.  

వెరిఫికేషన్​

ట్విట్టర్​ని మస్క్ కొన్న తర్వాత అనేక మార్పులు చేశాడు. ముఖ్యంగా వెరిఫికేషన్​ సబ్​స్క్రిప్షన్​ ప్రోగ్రామ్‌‌ తీసుకొచ్చాడు. వాస్తవానికి దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ.. ఇది ఊరికే రాదు. డబ్బులు కట్టి సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాలి. తర్వాత ఇన్​స్టాగ్రామ్​ కూడా దాన్నే ఫాలో అయ్యింది. వెరిఫికేషన్​కు కొంత డబ్బు ఛార్జ్​ చేసింది. కానీ.. థ్రెడ్స్​లో ప్రత్యేకంగా వెరిఫికేషన్​ టిక్​ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇన్​స్టాగ్రామ్​లో టిక్ మార్క్​ ఉంటే థ్రెడ్స్​లో కూడా వస్తుంది. 

మల్టీమీడియా పోస్ట్‌‌లు

రెండు ప్లాట్‌‌ఫామ్స్​లో వెబ్‌‌సైట్ లింక్‌‌లు, వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేసే వీలుంది.  రెండింటిలోనూ జిఫ్​ ఫైల్​ని కూడా పోస్ట్​ చేయొచ్చు. కానీ థ్రెడ్స్​లో పోస్ట్ చేయడానికి ముందుగా కెమెరా రోల్‌‌లో జిఫ్​ని సేవ్ చేయాలి. ట్విట్టర్‌‌లో ఒక్కో ట్వీట్‌‌కు నాలుగు ఫొటోలు మాత్రమే ఎటాచ్​ చేయొచ్చు. థ్రెడ్స్​లో ఒకేసారి పది షేర్​ చేయొచ్చు. 

సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో పోస్ట్​చేసే కంటెంట్, వీడియోల​కు  లైక్స్, సబ్​స్క్రయిబర్స్​ పెరుగుతుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది కదా! అలాగే మన పోస్ట్​లు షేర్​ అయ్యి ...వైరల్​ అవుతుంటే ‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ అంటూ మనసు తెగ పాటలు పాడేసుకుంటుంది. పాపులారిటీ పెరిగిపోయి మానిటైజేషన్​ మొదలైందంటే.... ఎవరి జీవితానికి వాళ్లే మహారాజు/మహారాణి. కొందరైతే ఒకటికి మించి అకౌంట్​లు మేనేజ్​ చేస్తుంటారు కూడా. ఇదంతా సోషల్​ మీడియా ప్లాట్​ ఫామ్స్​కి ఇవతల ఉండి వాడుతున్న వాళ్ల పరిస్థితి.  కానీ... ఆ ప్లాట్​ఫామ్స్​ను మనకి అందిస్తున్న కంపెనీలు మాత్రం వీటి విషయంలో క్షణక్షణానికి పోటీపడుతుంటాయి. ‘నువ్వు ఆ ఫీచర్​ ఇచ్చావా? చూస్కో నేను ఈ ఫీచర్​ యాడ్​ చేశా’ అనుకుంటూ యాప్స్​ను  డెవలప్​ చేస్తుంటాయి.

థ్రెడ్స్​ వాడుతున్నసెలబ్రిటీలు

సెలబ్రిటీలు, న్యూస్​ ఆర్గనైజేషన్స్​, కార్పొరేషన్స్​ కొన్ని థ్రెడ్స్​ వచ్చిన వెంటనే వాడడం మొదలుపెట్టాయి. వాళ్లలో జెన్నిఫర్​ లోపెజ్​, షకీరా, గోర్డన్​ రామ్​సే, టామ్​ బ్రాడీ, కోల్డ్​ప్లే, కిమ్​ కర్దాషియన్​, ఓప్రా, కైలీ జెన్నర్​ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. మిస్టర్​ బీస్ట్​ – పేరున్న యూట్యూబర్​. థ్రెడ్స్​లోకి వచ్చిన వెంటనే 7,40,000 సబ్​స్క్రయిబర్లను తెచ్చుకున్నాడు. ఇంకా సబ్​స్క్రయిబర్స్​ యాడ్​ అవుతూనే ఉన్నారు. నెట్​ఫ్లిక్స్​, , మెక్​ డోనాల్డ్స్, స్పోటిఫై, యాపిల్​ వంటి కంపెనీలు, ది న్యూయార్క్​ టైమ్స్​, బీబీసీ వంటివి థ్రెడ్స్​​లో చేరాయి. డెయిలీ మెయిల్​ అయితే న్యూస్​ స్టోరీలను పోస్ట్​ చేయడం మొదలుపెట్టేసింది.

థ్రెడ్స్​, ట్విట్టర్​ మధ్య తేడాలు​ 

  • థ్రెడ్స్​లో హ్యాష్​ట్యాగ్స్​ లేవు
  • అవసరమైన టెక్స్ట్​ లేదా ఫ్రేజెస్​ వెతికే ఆప్షన్​ లేదు.
  • ఒక సింగిల్​ పోస్ట్​లో పది ఫోటోలు షేర్​ చేయొచ్చు. ఇన్​స్టాగ్రామ్​లో కూడా సేమ్​ లిమిట్​ ఉంది. ట్విట్టర్​లో అయితే నాలుగు ఫొటోలు​ మాత్రమే పోస్ట్​ చేయొచ్చు.
  • థ్రెడ్స్​లో 500 క్యారెక్టర్ల లిమిట్​ ఉంది. అదే ట్విట్టర్​లో అయితే మ్యాగ్జిమమ్​ 280 క్యారెక్టర్లు మాత్రమే పోస్ట్​ చేయొచ్చు.
  • థ్రెడ్స్​లో ఐదు నిమిషాలుకు మించని వీడియోలు పోస్ట్​ చేయొచ్చు​.
  • ఒకవేళ థ్రెడ్స్​ అకౌంట్​ వద్దనుకుంటే డీ యాక్టివేట్ చేయొచ్చు. కానీ మీ డాటా మాత్రం డిలీట్​ కాదు. ఒకవేళ థ్రెడ్స్​​ అకౌంట్​ పూర్తిగా డిలీట్​ చేయాలనుకుంటే మాత్రం దానికి లింక్​ అయి ఉన్న ఇన్​స్టాగ్రామ్​ ఖాతా కూడా మూసేయాల్సిందే.

గెలుపు ఎవరిది?

ఇప్పటివరకు డామినెంట్ పొజిషన్​లో ఉన్న ట్విట్టర్​​ను థ్రెడ్స్​ రీప్లేస్​ చేస్తుందా అంటే ముందు ముందు చూడాల్సిందే. ఇది ఒక్క రోజులో ఒక్క మాటలో తేల్చే విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే చాలా పెద్ద యుద్ధం.  ఏదెలా ఉన్నా ఇన్​ఫ్లుయెన్స్​, ఆనర్​, పవర్​, ప్లెజర్​, మనీ(డాలర్లు) వంటివే ముఖ్యం. వాటి ముందు వాటి యూజర్స్ మనమంతా వెనకే ఉంటాం.

ఎలాన్​ మస్క్​ v/s జుకర్​బర్గ్​

ట్విట్టర్​కి పోటీగా ఇన్​స్టాగ్రామ్​ తెచ్చిన థ్రెడ్స్​ యాప్​ ఒక వారం రోజుల్లోనే వంద మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఇంత స్పీడ్​గా ఎదిగిన యాప్​ లేదు. ఓపెన్​ ఎఐ చాట్​జీపీటీ ఇంతకు ముందు వంద మిలియన్ల యాక్టివ్​ యూజర్లను తెచ్చుకుని రికార్డుకి ఎక్కింది. అంతమంది యూజర్లు వచ్చేందుకు దానికి రెండు నెలలు పట్టింది. కానీ థ్రెడ్స్​ యాప్​ మాత్రం లాంచ్​ చేసిన మొదటి 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా యూజర్లను సొంతం చేసుకుంది. 

ఇండియాలో ఎక్కువ

ట్విట్టర్​కి పోటీగా ఇప్పటివరకు ఎన్ని యాప్స్​​ వచ్చినా అంత సక్సెస్​ కాలేదు. కానీ.. ఇప్పుడు వచ్చిన థ్రెడ్స్​ని మాత్రం ప్రపంచమంతా యాక్సెప్ట్‌‌ చేస్తోంది. దీన్ని మెటా తీసుకురావడం వల్లే ఇంత క్రేజ్​ వచ్చింది. పైగా మన దేశం నుంచే ఎక్కువ డౌన్​లోడ్స్​ అయ్యాయి. మొదటి రోజున వచ్చిన మొత్తం డౌన్​లోడ్స్​లో ఇండియా నుంచి దాదాపు 22శాతం ఉన్నాయి. తర్వాత స్థానంలో బ్రెజిల్, అమెరికాలు 16, 14శాతాలతో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్​ని ఎక్కువగా ఆండ్రాయిడ్​ యూజర్స్​ డౌన్​లోడ్​ చేసుకున్నారు. ఆండ్రాయిడ్​ వాటా దాదాపు 75 శాతం ఉండగా ఐఓఎస్​ వాటా 25 శాతం. 

ట్విట్టర్​కు ఎందుకు దెబ్బ?

ఎలాన్​ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్​ను కొన్నాడు. ఆ తర్వాత అందులో చేసిన మార్పులు, అడ్వర్టైజ్​మెంట్స్ ఇచ్చేవాళ్లను ఇబ్బంది పెట్టాయి. అలాగే యూజర్​ చూసే ట్వీట్ల సంఖ్యకు లిమిట్ పెట్టడం, బ్లూ టిక్ కోసం డబ్బులు కట్టమనడం వంటివి చేయడం వల్ల ట్విట్టర్​కు బదులు వేరే యాప్​లకు వెళ్లిపోయారు యూజర్లు. అలా రోజురోజుకి ట్విట్టర్​ చూసేవాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇదే అదనుగా చూసిన జుకర్​బర్గ్​, కరెక్ట్​ టైంలో థ్రెడ్స్​ను లాంచ్​​ చేశాడు. అంతేకాదు... అలా వచ్చిందో లేదో ఇన్​స్టాగ్రామ్​ యూజర్లంతా థ్రెడ్స్​లోకి సైనప్​ అయ్యారు. నిజానికి ట్విట్టర్​కు నెలకు 22.9 కోట్ల మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నట్టు గతంలో మస్క్​ చెప్పాడు. అయితే, మెటాకు చెందిన ఇన్​స్టాగ్రామ్​కు ఏకంగా నెలకు 200 కోట్ల మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా థ్రెడ్స్​లోకి రావడంతో రాబోయే రోజుల్లో ట్విట్టర్​ను థ్రెడ్స్​ దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది.

కాకపోతే... ప్రస్తుతానికి థ్రెడ్స్​కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంది. వెబ్​, డెస్క్​ టాప్​లోకి ఇంకా రాలేదు. వందకు పైగా దేశాల్లో మాత్రమే ఇది వాడకంలో ఉంది. యూరప్​ సహా మరికొన్ని దేశాల్లో ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ యూప్​లో హ్యాష్​ ట్యాగ్స్​, కీవర్డ్​ సెర్చ్ వంటి ఫంక్షన్స్ ఇప్పటికైతే లేవు. డైరెక్ట్​గా మెసేజ్ పంపే ఆప్షన్​ కూడా లేదు. కాబట్టి వీటన్నింటినీ తీసుకొస్తేనే ట్విట్టర్​ని రీప్లేస్​ చేసే అవకాశం ఉంటుంది.