లాకప్‌‌‌‌‌‌‌‌ డెత్‌‌‌‌పై తమిళనాట నిరసనలు

లాకప్‌‌‌‌‌‌‌‌ డెత్‌‌‌‌పై తమిళనాట నిరసనలు

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఓ మొబైల్ షాపు ఓనర్, అతడి కొడుకు పోలీసుల కస్టడీలో చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కర్ఫ్యూ టైంలో షాపు ఓపెన్​ చేసి ఉంచారని తండ్రీ కొడుకులు జయరాజ్, బెనిక్స్ లను స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో వారిద్దరూ ఆస్పత్రిపాలై చనిపోయారు. దీంతో వారి మరణాలకు కారకులైన పోలీసులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, మర్డర్ కేసులు పెట్టాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తండ్రి, సోదరుడి డెడ్ బాడీలపై విపరీతమైన గాయాలున్నాయని, లాకప్​లో పోలీసులు వారిని టార్చర్ పెట్టారని జయరాజ్ కూతురు ఆరోపించారు. ఇద్దరి మరణాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకునే వరకు వారి డెడ్​బాడీలను కూడా అంగీకరించబోమని ఆందోళనకు దిగారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం దుకాణాలు బంద్ పాటించాయి.

అసలేంజరిగిందంటే..

తూత్తుకుడి జిల్లాలో ఓ మొబైల్ స్టోర్ నడుపుకునే తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(30) లను అక్కడి పోలీసులు పోయిన శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల సమయంకన్నా ఎక్కువ సేపు షాపు తెరిచి ఉంచారన్న ఆరోపణపై వారిద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లి కోవిల్పట్టి సబ్​జైలులో రిమాండ్ చేశారు. ఈ నెల 20న జైలు నుంచి విడుదలైన తండ్రీకొడుకులు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక అనారోగ్యంపాలవడంతో కోవిల్పట్టి జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 22న బెనిక్స్ మరణించగా.. అతని తండ్రి జయరాజ్ ఆ మరుసటి రోజు ఉదయం చనిపోయారు. పోలీసులు వారిని దారుణంగా టార్చర్ చేశారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే వారికి తీవ్ర రక్త స్రావం అయిందని, ఆస్పత్రిలో చేర్పించగా చనిపోయారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై తూత్తుకుడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారించింది. ఈ కేసుతో సంబంధమున్న పోలీసులిద్దరిని సస్పెండ్ చేస్తూ.. మృతుల పోస్టుమార్టంను వీడియో తీయాలని ఆదేశించింది.

రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

తమిళనాడు సీఎం కె పళనిస్వామి ఈ ఘటనపై స్పందిస్తూ మద్రాస్ హైకోర్టు, మదురై బెంచ్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తండ్రీకొడుకుల మరణాలపై మెజిస్టీరియల్ దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబాలకు రూ .10 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించారు. మరణాలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని, సాతంకుళం ఇనిస్పెక్టర్ ను డిపార్ట్ మెంట్​కు అటాచ్ చేశామని చెప్పారు.

కాపాడాల్సినోళ్లే ఇట్ల చేసుడు దారుణం: రాహుల్

‘‘పోలీసుల క్రూరత్వం మహానేరం. ప్రజల్ని రక్షించాల్సినవాళ్లే ఇలా ప్రవర్తించడం దారుణం. బాధితుల కుటుంబానికి నా సంతాపం చెబుతున్నా. వారికి న్యాయం చేయాలని తమిళనాడు సర్కార్​ను కోరుతున్నా”అని కాంగ్రెస్​ నేత రాహుల్ ట్వీట్​ చేశారు.

స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల డబ్బు తగ్గుతోంది