కరీంనగర్ PMJ జువెలర్స్ దోపిడీ కేసు: చెట్ల పొదల్లో దొరికిన రెండు తుపాకులు..!

కరీంనగర్ PMJ జువెలర్స్ దోపిడీ కేసు: చెట్ల పొదల్లో దొరికిన రెండు తుపాకులు..!

కరీంనగర్ లో దుమారం రేపిన PMJ జువెలర్స్ దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు సుబోధ్ సింగ్, రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్, రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్‌లను జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఇవాళ్టితో నిందితుల కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి...

విచారణలో భాగంగా వెలిచాల బైపాస్ రోడ్ వద్ద చెట్ల పొదల్లో దాచిన రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మద్దునూరు గ్రామ అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన వివో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి గురైన బంగారం, వజ్రాల ఆభరణాల వివరాలను నిందితులు గోప్యంగా ఉంచుతున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

ఆభరణాలు ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారు అనే అంశాలపై నిందితులు సహకరించకపోవడంతో దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నామని తెలిపారు.ఆభరణాల దాచివేతపై నిందితులు పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఇచ్చినట్లు వెల్లడించారు పోలీసులు. నిందితులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... మరికొన్ని రోజుల పోలీస్ కస్టడీ కోసం కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు పోలీసులు.

►ALSO READ | మిస్టరీగా మారిన బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు... రెండు వారాలైనా లభించని ఆచూకీ..

ఈ కేసులో పరారీలో ఉన్న కీలక నిందితుడు A-10 అమర్‌సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 4న బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లా సలింపూర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుంది ప్రత్యేక బృందం. 

ట్రాన్సిట్ వారెంట్‌పై నిందితుడిని కరీంనగర్‌కు తీసుకొస్తున్నారు పోలీసులు.పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని వెల్లడించారు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం.