పోలెండ్​కు గ్యాస్​ సప్లై కట్

పోలెండ్​కు గ్యాస్​ సప్లై కట్

పోలెండ్​కు గ్యాస్​ సప్లై కట్
బల్గేరియాకు కూడా ఆపేసిన రష్యా
రూబుల్​లో చెల్లింపులపై పేచీతో నిర్ణయం

కీవ్ :
యూరోపియన్​ దేశాలు పోలెండ్, బల్గేరియాలకు గ్యాస్​ సరఫరాను రష్యా కట్​ చేసింది. ఈ నెలకు సంబంధించి చెల్లింపులు ఇంకా అందకపోవడంతో బుధవారం సరఫరా ఆపేసింది. వెస్ట్రన్​ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యాకు డాలర్లలో ఎలాంటి లావాదేవీలు జరిపే వీల్లేకుండా పోయింది. దీంతో తమ సొంత కరెన్సీ రూబుల్​లోనే వ్యాపారం చేస్తామని, రూబుల్​లో చెల్లింపులు జరిపిన వాళ్లకే నేచురల్​ గ్యాస్​ అందజేస్తామని గతంలోనే ప్రకటించింది. తాజాగా ప్రెసిడెంట్​ పుతిన్​ నిర్ణయాన్ని ప్రభుత్వ సంస్థ గాజ్​ప్రోమ్​ బుధవారం అమలుచేసింది. ఇకముందు కూడా రూబుల్​లో చెల్లింపులు జరిపితేనే గ్యాస్​ సరఫరా చేస్తామని తేల్చిచెప్పింది. రష్యా నిర్ణయంతో యురోపియన్​ దేశాల్లో గ్యాస్​ ధరలు ఒక్కసారిగా దాదాపు 20% పెరిగాయి. రష్యా నిర్ణయంతో పోలెండ్, బల్గేరియా దేశాలకు వెంటనే ఇబ్బంది లేకపోయినా.. కొంతకాలం తర్వాత ఇబ్బంది తప్పదని నిపుణులు చెప్తున్నారు. గ్యాస్​ సరఫరా ఆపేస్తుందనే విషయం ఊహించిందేనని అంటున్నారు. ఇప్పటికే ఉన్న నిల్వలు ఇంకొంత కాలం వస్తాయని, ఎండాకాలం కావడంతో ఇండ్లల్లో గ్యాస్​ వాడకం ఎక్కువగా ఉండదని చెప్పారు. కాగా, 27 దేశాలు ఉన్న యూరోపియన్​ యూనియన్​లో అర్జెంటుగా ఓ స్పెషల్​ గ్రూపు ఏర్పాటైంది. రష్యా గ్యాస్​  సరఫరా ఆపేయడం వల్ల ఈయూ దేశాలపై పడే ప్రభావాన్ని సాధ్యమైనంత తక్కువ చేయడానికి ఇది పనిచేస్తుంది. రష్యా నిర్ణయాన్ని వెస్ట్రన్​ దేశాలు తప్పుబడుతున్నాయి. బ్లాక్​మెయిలింగ్​కు ఇదేమీ తీసిపోదని బల్గేరియా ప్రధాని కిరిల్​ విమర్శించారు.