ODI World Cup 2023: మన ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. శ్రమించక తప్పదు

ODI World Cup 2023: మన ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. శ్రమించక తప్పదు

వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టే.. మన ఫైనల్ ప్రత్యర్థి. ఆదివారం(నవంబర్ 19న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ కోసం ఈ ఇరు జట్లు తలపడనున్నాయి.

ప్రస్తుతం మన జట్టు ఫామ్, సాధిస్తున్న విజయాలను బట్టి ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టం కాకపోయినా.. గెలుపు కోసం శ్రమించాల్సి రావొచ్చు. కంగారూలు అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించరు. ఈ టోర్నీలో రోహిత్ సేన ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలతో జోరు మీదుంటే.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి మినహా కంగారూలు అలానే కనిపిస్తున్నారు. దీంతో మ్యాచ్ హోరీహోరీగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆపై నాకౌట్ పోరులో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను మట్టి కరిపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు, మెగా టోర్నీ ఆరంభంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్ సెమీస్ చేరేది కష్టమే అనిపించినా.. ఆ తరువాత అనూహ్యంగా పుంజుకొని వరుస విజయాలు సాధించింది. అఫ్ఘనిస్తాన్‌పై చచ్చీ చెడీ గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆపై నాకౌట్ పోరులో పటిష్ట సౌతాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

అలసత్వం వహిస్తే ఫలితం తారుమారు!

ఇలా ఇరు జట్ల ప్రయాణంలో చాలా తేడా ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. గతంలో వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 7 సార్లు ఫైనల్ చేరిన ఆసీస్ జట్టు.. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచారంటే ఫైనల్‌లో వారు ఎలా ఆడతారో ఊహించగలం. ఆదిలోనే వారిని దెబ్బ కొట్టాలి. మొదట బ్యాటింగ్ అయితే, న్యూజిలాండ్‌పై ఎలా దూకుడుగా ఆడామో అదే శైలి వీరిపై కూడా అనుసరించాలి. అదే మొదట బౌలింగ్ అయితే వీలైనంత త్వరగా వార్నర్, త్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లను పెవిలియన్ చేర్చాలి. అప్పుడే మ్యాచ్‌పై పట్టు సాధించగలం. ఈ  మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.