
న్యూఢిల్లీ, హైదరాబాద్, వెలుగు: మూడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ క్లియనెన్స్ ఇచ్చింది. ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం), చనాకా–కొరాట, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్ స్కీంలకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన టీఏసీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 3ప్రాజెక్టులకు తుది అనుమతులిచ్చారు. కేంద్ర జలశక్తి శాఖ 2021 జులై 14న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అన్ అప్రూవ్డ్ ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి డీపీఆర్‌లు సమర్పించి అన్ని అనుమతులు తీసుకోవాలని రూల్పెట్టారు. మొదట 6ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించింది.
తర్వాత మరో 2ప్రాజెక్టుల డీపీఆర్‌లందజేసింది. వాటిలో చిన్నకాళేశ్వరం, చనాకా–కొరాట, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌లను ఫ్లో చార్ట్ ప్రకారం పరిశీలించిన సీడబ్ల్యూసీ డైరెక్టరేట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(జీఆర్‌ఎంబీ) ఆమోదం కోసం పంపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన జీఆర్‌ఎంబీ 13వ మీటింగ్‌లో 3డీపీఆర్‌లపై సమీక్షించారు. ఏపీ అభ్యంతరాలు లేవనెత్తినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రాజెక్టులకు టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇవ్వొచ్చని పేర్కొంటూ టీఏసీకి రికమండ్ చేశారు. తాజా టీఏసీ మీటింగ్‌లో ఈ 3ప్రాజెక్టులపై చర్చించి క్లియరెన్స్ ఇచ్చినట్టు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ప్రకటించారు. సమావేశంలో అడిషనల్ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీ, సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్‌కే గుప్త, సభ్యులు చంద్రశేఖర్ అయ్యర్, రుష్విందర్ ఓరా, సీఈలు పైథాంకర్, బీపీ పాండే పాల్గొన్నా రు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇరిగేషన్ స్పెష ల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూదన్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డిలు సందేహాలను నివృత్తి చేశారు.
చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం
రాష్ట్ర విభజనకు ముందే చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల స్కీం పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఈ ఎత్తిపోతలను చేపట్టారు. రూ.48.20 కోట్లతో నిర్మించిన ఈ ఎత్తిపోతలతో 8,297 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.
ఇంకో నాలుగు ప్రాజెక్టులకు క్లియరెన్స్ రావాలి
గోదావరిపై నిర్మిస్తున్న 3ప్రాజెక్టులకు క్లియరెన్స్ రాగా ఇంకో 4ప్రాజెక్టుల పర్మిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సీతారామ ఎత్తిపోతలు, తుపాకులగూడెం (సమ్మక్క బ్యారేజీ), మోడికుంటవాగు, గూడెం ఎత్తిపోతలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ 4ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీలోని డైరెక్టర్లు దాదాపు ఆమోదం తెలిపాయి. త్వరలోనే మోడికుంటవాగు, గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లు గోదావరి బోర్డు అనుమతుల కోసం రానున్నాయి. ఆ తర్వాత మి గ తా 2డీపీఆర్‌లు వస్తాయని ఇంజనీర్లు చెప్తున్నారు.
చిన్న కాళేశ్వరంతో 45 వేల ఎకరాలకు నీళ్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపడుతున్న ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకంతో 63 గ్రామాల పరిధిలో 45 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. గోదావరిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 4.50 టీఎంసీలు ఎత్తిపోయనున్నారు. ఇందులో 4.20 టీఎంసీలు సాగునీటికి, 0.30 టీఎంసీలు తాగునీటికి ఉపయోగిం చనున్నారు. రూ.545.15 కోట్లతో ఈ ఎత్తి పోతల స్కీం నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పం పుహౌస్, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల కోసం 1,467 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉం ది. పంపుల కోసం 29 మెగావాట్ల కరెంట్ అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం రూపాయి ఖర్చు చేస్తే రూ.2.69 ఆదాయం వస్తుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు.
ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు చనాకా-కొరాట
తెలంగాణ, మహారాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టుగా పెన్‌గంగా నదిపై చనాకా - కొరాట నిర్మిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. మహారాష్ట్రలో కొంత అటవీ భూమి ముంపునకు గురవుతుండటంతో అక్కడ పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో సంబంధం లేకుండా తెలంగాణ వరకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న విజ్ఞప్తికి గతంలోనే ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో 5,566 హెక్టార్ల భూమి సాగులోకి రానుంది. ఇందుకోసం 1.20 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. మహారాష్ట్రలో 1,214 హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.452.50 కోట్లు కాగా ఇందులో తెలంగాణ వాటా రూ.409.44 కోట్లు, మహారాష్ట్ర వాటా రూ.43.06 కోట్లుగా ఉంది. ప్రాజెక్టు కింద 16.80 హెక్టార్ల భూమి తెలంగాణలో ముంపునకు గురవుతోంది.