భారతీయ కంపెనీలకు.. అతిపెద్ద ముప్పు సైబర్‌‌‌‌ దాడులే!

భారతీయ కంపెనీలకు.. అతిపెద్ద ముప్పు సైబర్‌‌‌‌ దాడులే!

న్యూఢిల్లీ:  తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు సైబర్ దాడులేనని మనదేశ కంపెనీలు చెబుతున్నాయి. 38 శాతం మంది రెస్పాండెంట్లు మరీ ఎక్కువగా వీటి బారిన పడుతున్నారని ఒక సర్వే పేర్కొంది.  2022 గ్లోబల్ రిస్క్ సర్వేతో పోల్చినప్పుడు, సైబర్ సెక్యూరిటీ రిస్క్ రాడార్‌‌‌‌లో ఇండియా మూడు స్థానాల నుంచి మొదటి స్థానానికి చేరుకుందని పీడబ్ల్యూసీ  2023 గ్లోబల్ రిస్క్ సర్వే-ఇండియా ఎడిషన్ పేర్కొంది. 67 దేశాల బిజినెస్ అండ్ రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్ లీడర్ల (సీఈఓ, బోర్డ్, రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్, ఆపరేషన్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, ఆడిట్) నుంచి వచ్చిన 3,910 అభిప్రాయాల ఆధారంగా సర్వేను తయారు చేశారు.

 వీటిలో163 భారతీయ సంస్థలు ఉన్నాయి. ఇతర డిజిటల్,  టెక్నాలజీ రిస్క్‌‌‌‌లు కూడా తమకు తలనొప్పిగా మారాయని 35 శాతం మంది భారతదేశ బిజినెస్​ లీడర్లు చెప్పారు. సైబర్​సవాళ్లను పరిష్కరించడానికి, భారతీయ సంస్థలు సైబర్‌‌‌‌ సెక్యూరిటీలో భారీగా ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తున్నాయి. రెస్పాండెంట్లలో సగానికి పైగా సైబర్‌‌‌‌ సెక్యూరిటీ టూల్స్ (55 శాతం)  ఏఐ, మెషిన్ లెర్నింగ్,  ఆటోమేషన్ టెక్నాలజీలలో (55 శాతం) మరింత పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.   

డేటా ఎనాలసిస్​

71 శాతం భారతీయ సంస్థలు రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్, ఆపర్చునిటీ ఐడెంటిఫికేషన్​ కోసం సైబర్‌‌‌‌ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి విశ్లేషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 61 శాతం సంస్థలు ఇదే పని చేస్తున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ శివరామ కృష్ణన్ మాట్లాడుతూ 2023 గ్లోబల్ రిస్క్ సర్వే ప్రకారం భారతీయ వ్యాపార నాయకులు రిస్క్‌‌‌‌లు తీసుకోవడానికి వెనకాడటం లేదని, రిస్క్‌‌‌‌ల ద్వారా లభించే అవకాశాలను గుర్తించడంలో ముందుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఆలోచనా విధానం  సంస్థ  పురోగతికి కీలకమని, వ్యాపార నష్టాలను తట్టుకునేలా చేస్తుందని అన్నారు. 99 శాతం మంది భారతీయ వ్యాపార నాయకులు తమ సంస్థ రిస్క్‌‌‌‌ను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వృద్ధి సాధించవచ్చని విశ్వసిస్తున్నారని  సర్వేలో తేలింది. 

 భారతీయ వ్యాపారాలు  సాంకేతిక విఘాతాలను (టెక్​ డిస్రప్టర్స్​) అవకాశాలుగా చూస్తున్నాయి. 69 శాతం మంది ఎగ్జిక్యూటివ్​లు జనరేటివ్ ఏఐని ఒక అవకాశంగా భావిస్తున్నారు. రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్ కోసం జెన్​ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల (ఎమర్జింగ్ టెక్నాలజీలు) సహాయాన్ని సంస్థలు తీసుకుంటున్నాయి. 48 శాతం భారతీయ సంస్థలు ఆటోమేటెడ్ రిస్క్ అసెస్‌‌‌‌మెంట్ రెస్పాన్స్​ కోసం ఏఐ  మెషిన్ లెర్నింగ్‌‌‌‌ను వాడాయి.  రిస్క్‌‌‌‌లు  అంతరాయాల వల్ల వచ్చే సానుకూలతలను ఉపయోగించుకోవడానికి, 88 శాతం భారతీయ సంస్థలు గత 12 నెలలుగా తమ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడానికి చురుకుగా పెట్టుబడులు పెడుతున్నాయి.