
Tech News: ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఒకప్పుడిలా అస్సలు లేదు. హై ప్యాకేజీలు కావాలన్నా లేక అసలు జాబే కావాలనే కలలు చాలా మంది నేటి యువతకు ఉంటున్నాయి. అయితే ఏఐ యుగంలో చేస్తున్న తప్పులు వారికి ఉద్యోగాలు దొరక్కుండా చేస్తున్నాయని తాజాగా ఒక ఇన్సిడెంట్ వెల్లడించింది.
ఇటీవల ఒక ఐటీ కంపెనీ జూనియర్ డెవలపర్ ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ ప్రకటించింది. దీనికోసం ఏకంగా 12వేల మంది అప్లై చేశారు. అయితే ఇందులో 450 మంది క్యాండిడేట్లను ఇంటర్వ్యూ చేయగా కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా సెలెక్ట్ కాలేదు. పైగా కంపెనీ ఈ జాబ్ రోల్ కోసం ఏకంగా రూ.20 లక్షల శాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా చేసిన ఫిల్టరింగ్ లో ఏకంగా 10వేల మందికి అవసరమైన స్కిల్స్ లేనట్లు కంపెనీ గ్రహించి తొలగించింది.
తాము అక్కడికి వచ్చిన క్యాండిడేట్లకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఏఐ టూల్ చాట్ జీపీటీని కూడా ఉపయోగించేందుకు అనుమతించినట్లు కంపెనీ చెప్పింది. చాలా మంది ఏఐ నుంచి కోడ్ కాపీ పేస్ట్ చేస్తున్నారే కానీ దానికి అర్థం కూడా తెలుసుకోవటం లేదని కంపెనీ రెడిట్ లో ప్రకటించింది. ఈ కాలంలో వారు రాస్తు్న్న కోడ్ గురించి అర్థమయ్యే డెవలపర్లు దొరకటం చాలా కష్టతరంగా మారిందని చెప్పుకొచ్చింది. కనీసం కాపీ పేస్ట్ చేసే ముందు డెవలపర్లు తాము చేస్తున్న పని గురించి, కోడ్ పనితీరు గురించి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మీ రిక్రూట్మెంట్ టీమ్ కంపెనీ అవసరాలకు తగిన డెవలపర్లను వెతకటంలో ఇబ్బంది పడుతున్నట్లుందని అన్నారు. ఒక్క ఇంజనీర్ ని రిక్రూట్ చేసుకోవటం కోసం ఇన్ని గంటలు సమయం వృధా చేయటం సరైనది కాదని వారు కంపెనీకి సూచిస్తున్నారు. అలాగే కంపెనీ తన ఇంటర్వ్యూ విధానాన్ని కూడా సవరించుకోవాల్సి ఉంటుందన్నారు. కేవలం క్యాండిడేట్లను నిందించటం తగదని మరికొందరు సూచిస్తున్నారు.
ALSO READ | కష్టాల్లో ఇండియన్ ఫ్యామిలీస్.. భారీగా తగ్గిన డబ్బు సేవింగ్, పెరిగిపోయిన అప్పుల భారం..!
అయితే ప్రస్తుతం యుగంలో ప్రజలు తమ ఉద్యోగ అవసరాల కోసం ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారని, అలాంటప్పుడు ఇంటర్వ్యూ ప్రక్రియలో దానిని వాడొద్దని అడటం సరైనది కాదని కంపెనీ చెబుతోంది. అయితే క్యాండిడేట్లు కోడ్ కాపీ చేయటానికి ముందు దానిలోని లాజిక్ ఏంటో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమని చెప్పింది. దీన్ని బట్టి చూస్తుంటే గుడ్డిగా ఏఐని నమ్ముకుంటే కనీసం జాబ్ పొందటం కూడా భవిష్యత్తులో కష్టమేనని తెలుస్తోంది.