20 కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు

20 కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు
  • ఆన్ లైన్ లో అగ్గువకు ఫోన్లు కొని అంతకంటే తక్కువ ధరకు అమ్ముతూ అమాయకులకు వల
  • దేశ వ్యాప్తంగా 800 మందిని మోసం చేసిన నిందితులు
  • 8మంది ముఠా సభ్యులను వలపన్ని పట్టుకున్న కేంద్ర పోలీసులు,  సైబర్ రక్షణ విభాగం
  • నిందితుల్లో ఒకరు రైల్వేలో ఇంజనీర్.. 
  • సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఆర్ధిక ఇబ్బందులతో అడ్డదారితొక్కిన సూత్రధారి
  • సైబర్ కేటుగాళ్ల ముఠా దగ్గర నుంచి 900 స్మార్టు ఫోన్లు స్వాధీనం

న్యూఢిల్లీ: అమాయకులను టార్గెట్ చేసి వారి అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ పోలీసులు, సైబర్ రక్షణ విభాగం వలపన్ని పట్టుకుంది. ఆన్ లైన్ లో అగ్గువకే ఫోన్లు కొని వాటిని తాము కొన్న దానికంటే తక్కువకు వెంటనే అమ్మి అమాయకులకు వల వేస్తున్నట్లు గుర్తించారు. వీరి నేరాలు దేశం నలుమూలలకు విస్తరించి ఉండడంతో వీని కార్యకలాపాలపై సైబర్ రక్షణ విభాగం నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులను అప్రమత్తం చేయడంతో ఎట్టకేలకు పట్టుపడ్డారు. 
పట్టుపడిన 8మంది ముఠాసభ్యుల్లో కీలక సూత్రధారి హుకుంసింగ్ రైల్వే ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఇతడు ఆర్ధిక ఇబ్బందులతో అడ్డదోవ తొక్కినట్లు తేలింది. జార్ఖండ్ కు చెందిన సంజయ్ అనే నిందితుడితో కలసి మోసాలు చేయడం ప్రారంభించారు. ఏడాది కాలంగా వీరిద్దరు కలసి మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ల నుండి మరో ఇద్దర్ని, జార్ఖండ్ నుంచి మరో నలుగుర్ని పరిచయం చేసుకుని ముఠాగా ఏర్పడ్డారు. 
వీరి వద్ద నుంచి 900 స్మార్టు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరించిన 300 మంది మొబైల్ ఫోన్లను, వెయ్యి  కిపైగా బ్యాంకు ఖాతాలను, వందలకొద్దీ యూపీఐ ఐడలు, ఈ-కామర్స్ ఐడీలను గుర్తించారు. అలాగే వీరి వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా భారీగా దొరకడంతో వీటి గురించి విచారించేందుకు సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. 
రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన 78 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి  ఫోన్ ద్వారా 6.5 లక్షల రూపాయలు కాజేశారు. మోసపోయిన వృద్ధుడు ఎఫ్ కార్డు సైబర్ సేఫ్ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈనెల 11న ముఠా మోసాల గురించి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నిందితులపై నిఘా ఉంచగా.. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ప్రాధమిక ఆధారాలతోపాటు ఆచూకీ లభించడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.