మంత్రి శ్రీధర్‌‌బాబు, ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌‌పై తప్పుడు ప్రచారం

మంత్రి శ్రీధర్‌‌బాబు, ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌‌పై తప్పుడు ప్రచారం
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్ శశిభూషన్
  • ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్‌, వెలుగు: ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి శైలజా రామయ్యర్‌ను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న ఇద్దరిపై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాళేశ్వరంలో ఇటీవల నిర్వహించిన సరస్వతీ పుష్కరాల్లో అక్రమాలు జరిగాయని, వాటి వెనుక మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఆయన భార్య దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ ఉన్నారంటూ సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం జరిగింది.

దీనిపై కాచిగూడకు చెందిన న్యాయవాది శశిభూషణ్ కాశే శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐతో రూపొందించిన ఫేక్‌(మార్ఫింగ్‌) వీడియోలను ‘బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని’ పేరుతో నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీతోపాటు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు.

మంత్రి శ్రీధర్‌‌బాబు, శైలజ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేస్తున్నారంటూ ఆధారాలను పోలీసులకు సమర్పించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు ఆ పోస్ట్‌లకు కారణమైన పెద్దపల్లి నాగేపల్లి క్రాస్‌ రోడ్స్‌కు చెందిన పుదరి సత్యనారాయణ గౌడ్‌తో పాటు కాటారానికి చెందిన జక్కు శ్రవణ్‌కు నోటీసులు జారీ చేశారు. వారిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.