రూ. 23 లక్షలకు టోకరా.. అధిక లాభాల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నరు

రూ. 23 లక్షలకు టోకరా.. అధిక లాభాల పేరుతో  కోట్లు కొల్లగొడుతున్నరు

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు అంటూ ఆఫర్లు... పథకాల పేరుతో కేటుగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. అతి తక్కువ పెట్టుబడికి అత్యధిక లాభాలు వస్తాయంటూ సైబర్‌ నేరగాళ్లు  అమాయకులను  ఊబిలోకి లాగి..ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా అధిక లాభాల ఆశ చూపి  ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఆమె నుంచి లక్షలకు లక్షలు కాజేశారు. ఈ సైబర్‌ మోసం హైదరాబాద్ సిటీలో  చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే...

ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఈమె ప్రొఫైల్ చూసి..సెలక్ట్ చేసుకున్నారు. ఆమెకు అమాయకపు మాటలు చెప్పారు. ఆన్ లైన్ ట్రేడింగ్ లో పెట్టబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఓ లింక్ పంపించి దాని ద్వారా డబ్బులు పంపించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన సదరు మహిళ..మొదట రూ. 2 వేలు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత విడతల వారీగా రూ. 23 లక్షల వరకు ట్రాన్స్ ఫర్ చేసింది. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడమే ఉంది కానీ..తిరిగి రావడం లేదని పలు మార్లు నిందితులను ప్రశ్నించింది. అయితే కనీసం రూ. 30 లక్షలు పెడితేనే కోటి రూపాయల వరకు వస్తాయని కేటుగాళ్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో  నేరగాళ్లను అనుమానించిన మహిళ...ఇన్నాళ్లు పెట్టిన డబ్బులను వాపస్ చేయాలని పట్టుబట్టింది. ఇంకేముంటుంది అప్రమత్తమైన కేటుగాళ్లు..ఆ మహిళకు పంపిన లింక్ ను డిలీట్ చేశారు. ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు..సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసింది. 


నకిలీ కాల్‌ సెంటర్‌ తో కటకటాల్లోకి ...

హైదరాబాద్ పేట్‌బషీరాబాద్‌లో నకిలీ కాల్‌ సెంటర్‌ నడుపుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో సైబరాబాద్‌ పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియన్‌ సిటిజన్స్‌ డేటాను కొనుగోలు చేసిన కొందరు కేటుగాళ్లు పశ్చిమబెంగాల్‌ నుంచి టెలికాలర్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కస్టమర్లకు ఫోన్లు చేయిస్తూ.. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ టీమ్‌గా నమ్మించి మోసాలు చేయడం మొదలు పెట్టారు. అయితే కేటుగాళ్ల  మోసం వెలుగులోకి రావడంతో కటకటాల పాలయ్యారు.  బ్రాండెడ్‌ సర్వీస్‌ సెంటర్‌ పేరుతో  మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.