టెలిగ్రామ్ లో ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడితే.. మీ ఖాతా ఖాళీ!

టెలిగ్రామ్ లో ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడితే..  మీ ఖాతా ఖాళీ!

సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్  అవుతూ.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో మంది అమాయకులకు ఎదోఒకటి ఆశ చూపుతూ బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు. ఈ మధ్య ఓటీటీ కల్చర్ బాగా పెరిగింది. సినిమాలతో పాటు కొత్తగా ఢిపరెంట్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఎక్కువమంది..ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వీటిని చూసేందుకు చాలా మంది టెలిగ్రామ్ లో జాయిన్ అవుతున్నారు. ఓటీటీలో ఎదైనా కొత్త సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ విడుదలైన వెంటనే.. సంబంధిత ప్లాట్ ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా.. టెలి గ్రామ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిపోతున్నారు. ఈక్రమంలో యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు రంగంలోకి దిగుతున్నారు.

 కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లకు థంబ్‌నైల్స్‌ పెట్టి..  టెలిగ్రామ్ వంటి గ్రూపుల్లో సైబర్‌ లింకులను అటాచ్‌ చేస్తున్నారు.  ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్న సూచన ఇస్తున్నారు. దాన్ని ఫాలో అయి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతి.. మీ ఖాతా ఖాలీ అయినట్లే.  యూజర్లు తెలియక.. ఆ లింక్స్‌ ఓపెన్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్లకు వారి సమాచారం వెళ్తుంది. దీంతో అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. ఈ తరహా సైబర్ మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన  కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్‌ దోస్త్‌.. యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది.  టెలిగ్రామ్‌ ద్వారా ఇచ్చే లింక్‌ల నుంచి ఎలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని.. తెలియని లింక్‌లను ఓపెన్‌ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించింది.