
నారాయణ్ ఖేడ్, వెలుగు: మీ మొబైల్ నంబర్ రూ.2 కోట్ల 90 లక్షలు గెలుచుకుందని నమ్మించి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలానికి చెందిన వ్యక్తి నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.27లక్షలు కొట్టేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. నారాయణఖేడ్మండలానికి చెందిన వ్యక్తి ఫోన్‌కు మీ జియో నంబర్ రూ.2కోట్ల 90లక్షలు గెలుచుకుందని మెసేజ్వచ్చింది. నిజమేనని నమ్మిన సదరు వ్యక్తి తన డీటెయిల్స్ అన్నీ పంపించాడు. తర్వాత అతనికి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి మీరు గెలుచుకున్న మొత్తం క్లైం చేసుకోవాలంటే రూ.17లక్షలు ట్యాక్స్కట్టాలని చెప్పడంతో వివిధ అకౌంట్లలో 17లక్షలు వేశాడు. గుర్తుతెలియని మరోసారి ఫోన్‌చేసి మీ ఇంటికి ఓ ఏటీఎం కార్డు పంపిస్తున్నాం దాని ద్వారా ప్రైజ్‌మనీ డ్రా చేసుకోమని చెప్పాడు. కార్డు ద్వారా రూ.5వేలు డ్రా చేసిన బాధితుడు తర్వాత డబ్బు రాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ప్రైజ్‌మనీ మొత్తం రావాలంటే మరో రూ.10 లక్షలు తమ అకౌంట్లలో వేయాలని గుర్తుతెలియని వ్యక్తి చెప్పగా బాధితుడు మరోసారి రూ.10లక్షలు వేశాడు. తర్వాత ఫోన్‌చేయగా మరికొంత అమౌంట్ వేయాలని కోరడంతో తాను సైబర్‌నేరగాళ్ల ట్రాప్‌లో పడిపోయానని బాధితుడు తెలుసుకున్నాడు. శుక్రవారం నారాయణ్ఖేడ్పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఎస్సై వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.