స్క్రాచ్ కార్డులతో సైబర్ ట్రాప్‌‌ 

స్క్రాచ్ కార్డులతో సైబర్ ట్రాప్‌‌ 
  • ఈ కామర్స్ సంస్థల పేరుతో కొత్త రకం మోసానికి తెర లేపిన సైబర్​నేరగాళ్లు
  • కార్లు, బైక్‌‌‌‌ విన్నర్స్‌‌‌‌గా ట్రాప్..  డెలివరీ చార్జీల పేరుతో వసూళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్​నేరగాళ్లు రోజుకో కొత్త తరహా ఎత్తుగడతో డబ్బులు కొట్టేసేందుకు స్కెచ్​ వేస్తున్నారు. ఇంతకాలం ఆన్​లైన్ ​లింకులు, ఓటీపీలతో అకౌంట్లు కొల్లగొట్టిన అక్రమార్కులు.. ఇప్పుడు ఈ కామర్స్​ సంస్థల పేరుతో స్క్రాచ్​ కార్డులు, గిఫ్ట్​కూపన్ల మోసానికి తెరలేపారు. కస్టమర్ల అడ్రస్‌‌, ఫోన్‌‌ నంబర్ల డేటా కలెక్ట్ చేస్తున్న సైబర్​ నేరగాళ్లు షాప్‌‌ క్లూస్‌‌, ప్లిప్‌‌కార్ట్‌‌, అమెజాన్‌‌ లాంటి ఈ కామర్స్ ​కంపెనీ పేర్లతో ఫేక్ లెటర్ హెడ్స్‌‌ క్రియేట్​చేస్తున్నారు. మీరు 7.10 లక్షలు విలువ చేసే కారు గెలుచుకున్నారు, లక్కీ డ్రాలో లక్ష రూపాయల విలువైన బైక్​ మీ సొంతం కాబోతుంది. వెహికల్​వాల్యూలో 3 శాతం చార్జీలు పే చేస్తే.. మీ ఇంటికి పంపిస్తామంటూ కస్టమర్లకు గిఫ్ట్‌‌ కూపన్స్‌‌, స్క్రాచ్​కార్డులు పోస్ట్‌‌ చేస్తున్నారు. గుర్గావ్‌‌, వెస్ట్​బెంగాల్​అడ్రస్​లతో ఈ దందా నడిపిస్తున్నారు. గ్రేటర్​హైదరాబాద్​మూడు పోలీస్​కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు పోలీసులకు పదుల సంఖ్యలో వచ్చాయి. 
ప్రైజ్ రిసీవ్ ఫామ్‌‌తో..
గిఫ్ట్ ​కూపన్, స్క్రాచ్​ కార్డులతో పాటు ప్రైజ్‌‌ కస్టమర్లకు ప్రైజ్​రిసీవ్ ఫామ్‌‌ పంపుతున్నారు. వారి పేరు, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌‌ఎస్‌‌సీ కోడ్‌‌, అకౌంట్‌‌తో లింకైన ఫోన్ నంబర్, ఆధార్‌‌‌‌ వివరాలతో గుర్‌‌‌‌గావ్‌‌ పోస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం హెల్ప్‌‌లైన్ నంబర్లు కూడా అందిస్తున్నారు. ప్రైజ్‌‌ కోసం కాల్స్ చేసే వారికి లింక్స్ పంపిస్తున్నారు. క్విక్ సపోర్ట్‌‌, టీమ్‌‌ వ్యూవర్ యాప్స్‌‌తో ఇన్‌‌స్టాల్‌‌ చేయిస్తున్నారు. మొబైల్‌‌ ఫోన్లను తమ చేతుల్లోకి తీసుకుని ఆపరేట్‌‌ చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్‌‌, ఓటీపీ, పిన్ నంబర్స్‌‌ ఆధారంగా అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు.

స్క్రాచ్​ కార్డులో కారు ..
జూన్‌‌ నెలలో మేము ఓ ఈ కామర్స్ సంస్థలో  మైక్రోవోవెన్‌‌ కొన్నం. హోమ్‌‌ డెలివరీ కోసం మా ఇంటి అడ్రస్ ఫోన్‌‌ నంబర్లు ఇచ్చాం. రెండు రోజుల క్రితం అదే కంపెనీ నుంచి మాకు ఓ లెటరొచ్చింది. స్క్రాచ్ కార్డ్‌‌తో మూడు గిఫ్ట్‌‌లు ఉన్నాయి. కారు విన్నర్‌‌‌‌గా మమ్మల్ని సెలెక్ట్ చేసినట్లు, దాని డెలివరి కోసం చార్జీలతో పాటు పూర్తి అడ్రస్ ​వివరాలు ఇయ్యాలని పేర్కొన్నారు. మాకు అనుమానం వచ్చింది. వెంటనే సైబర్‌‌‌‌ క్రైమ్ పోర్టల్‌‌లో కంప్లయింట్‌‌ చేశాం.
                                                                                                                                                    - సుభాషిణి, సరస్వతీనగర్‌‌‌‌, సాగర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్‌‌

స్క్రాచ్​కార్డులు.. కూపన్లు నమ్మొద్దు..
గిఫ్ట్‌‌ల పేరుతో వచ్చే మెసేజ్‌‌లు, కాల్స్‌‌, లెటర్లు ఎవరూ నమ్మొద్దు. ఈ కామర్స్ సైట్స్‌‌, ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. కస్టమర్ల డేటా కలెక్ట్ చేసి అకౌంట్లు ఖాళీ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దేన్నీ అంత తేలిగ్గా నమ్మి మోసపోవద్దు. మీకు అనుమానం వస్తే.. 155260 టోల్ ఫ్రీ నంబర్​లో గానీ, www.cybercrime.gov.in పోర్టల్​లో గానీ ఫిర్యాదు చేయొచ్చు.
                                                                                                                                                              - కేవీఎం ప్రసాద్‌‌, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్