గుట్టుగా రేషన్ బియ్యం తరలింపు.. నిందితులు అరెస్ట్

గుట్టుగా రేషన్ బియ్యం తరలింపు.. నిందితులు అరెస్ట్

కుత్బుల్లాపూర్ : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ మిల్లులకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెద్ద ఎత్తున అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మద్దూర్ లోని శివసాయి రైస్ మిల్లులో SOT పోలీసులు సోదాలు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా దాచి ఉంచిన 1200 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి.. సీజ్ చేశారు. రైస్ మిల్లు గుమస్తాను పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీడీఎస్ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.