యూరప్‎ ఎయిర్ పోర్టులపై సైబర్ ఎటాక్.. విమాన రాకపోకలకు బ్రేక్

యూరప్‎ ఎయిర్ పోర్టులపై సైబర్ ఎటాక్.. విమాన రాకపోకలకు బ్రేక్

యూరప్‎లోని ఎయిర్ పోర్టులపై సైబర్ ఎటాక్ కలకలం రేపింది. ఎయిర్ పోర్టుల్లోని చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ సర్వీస్ ప్రొవైడర్లే లక్ష్యంగా సైబర్ ఎటాక్ జరిగింది. సైబర్ దాడి కారణంగా బ్రస్సెల్స్ విమానాశ్రయం, లండన్ హీత్రో, బెర్లిన్ బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయం వంటి అనేక ప్రముఖ యూరోపియన్ ఎయిర్ పోర్టుల్లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 19) రాత్రి ఈ సైబర్ ఎటాక్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. సైబర్ దాడి కారణంగా పలు విమానాశ్రయాల్లో మాన్యువల్ పద్దతిలో చెక్-ఇన్ ప్రక్రియ చేపట్టారు ఎయిర్ పోర్టు అధికారులు. 

మాన్యువల్ పద్దతిలో చెక్ ఇన్ చేయడంతో తీవ్ర జాప్యం ఏర్పడింది. సైబర్ ఎటాక్ కారణంగా బ్రస్సెల్స్ విమానాశ్రయంలో చాలా విమానాలు రద్దు చేశారు. లండన్ హీత్రో ఎయిర్ పోర్టులో కూడా సైబర్ దాడి వల్ల విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాన్యువల్ పద్దతిలో చెక్ ఇన్ చేపడుతుండటంతో ప్రయాణికులు గంట రెండు గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించారు అధికారులు. ప్రయాణీకులు ఎయిర్ పోర్టులకు వెళ్లే ముందు వారి సంబంధిత విమానయాన సంస్థలతో ఫ్లైట్ వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

సైబర్ దాడి కారణంతో విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో వివిధ ఎయిర్ లైన్స్ సంస్థలకు చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ సర్వీస్ అందించే కాలిన్స్ ఏరోస్పేస్ సంస్థ సైబర్ ఎటాక్‎ను ధృవీకరించింది. సేవలను పునరుద్ధరించడానికి కంపెనీ చురుకుగా పనిచేస్తోందని తెలిపింది. సైబర్ దాడి కారణంగా బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేసింది. 

ALSO READ : ఆదివారం అర్థరాత్రి తర్వాత రూ.88 లక్షలు కట్టి రండి