సైబర్​ క్రైమ్ కేసులు​.. 700% పెరిగినయ్..!

సైబర్​ క్రైమ్ కేసులు​.. 700% పెరిగినయ్..!
  • మూడేండ్లలోనే భారీగా పెరిగిన నేరాలు
  • 2018లో 1,208 కేసులు ఈ ఏడాది 8 నెలల్లోనే 
  • 9,340 కేసులు నమోదు  పెరిగిన హ్యాకింగ్​,  ఈ-మెయిల్​ మోసాలు
  • 2018 నుంచి 2021 ఆగస్టు వరకు సైబర్​ క్రైమ్​ కేసులు


హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో సైబర్​ నేరాలు పెరుగుతున్నాయి. ఈ మూడేండ్లలోనే 700 శాతం పెరిగాయి. 2018లో 1,208 కేసులు నమోదైతే.. ఈ ఏడాది ఆగస్టు నాటికే 9,340 సైబర్​ క్రైమ్​ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సగటున నెలకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ పోలీస్​ స్టేషన్లలో కేసులు నమోదు చేసినవే.. బయటకు రానోళ్లు ఇంకా చాలా మందే ఉంటారని అధికారులు అంటున్నారు. పరువుపోతుందన్న ఉద్దేశంతో ముందుకు రావడం లేదని చెప్తున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ నుంచే 10 శాతం దాకా ఉంటున్నాయని చెప్తున్నారు. కరోనా ఫస్ట్​వేవ్​, సెకండ్​వేవ్​ టైంలోనే నేరాలు భారీగా పెరిగాయంటున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచే నేరాలు జరుగుతున్నట్టు తేల్చారు. మొన్నటిదాకా హైదరాబాద్​ వరకే ఉన్న సైబర్​ నేరాల కేసులు ఇప్పుడు జిల్లాల్లోనూ నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో జిల్లాకో సైబర్​ క్రైమ్​ పోలీస్​ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని సర్కారు అనుకున్నా.. అది ఆలోచనలకే పరిమితమైంది. 
హైదరాబాద్​లోనే ఎక్కువ
జిల్లాల్లోనూ సైబర్​ క్రైమ్ ​కేసులు వెలుగు చూస్తున్నా.. హైదరాబాద్​లోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. 2018 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు హైదరాబాద్​ సిటీలో 7,423 కేసులు నమోదయ్యాయి. తర్వాత రాచకొండ కమిషనరేట్​లో ఈ ఒక్క ఏడాదే 3,757 కేసులు వచ్చాయి. ఈ మూడేండ్లలో 4,440 కేసులను రిజిస్టర్​ చేశారు. సైబరాబాద్ లో 3,327 కేసులు, రాష్ట్రంలో ఉన్న సైబర్​ క్రైమ్​ యూనిట్లలో మరో 1,074 కేసులు నమోదయ్యాయి.  
ఫేక్​ ఐడీలు, ఓటీపీలతో దోపిడీ 
సైబర్​ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. మంచి గొంతుతో బోల్తా కొట్టించి బ్యాంకు ఖాతాలు,  క్రెడిట్ ​కార్డుల నుంచి సొమ్ము దోచేస్తున్నారు. సొసైటీలో పేరున్న వ్యక్తులు, ఫ్రెండ్స్​ ఎక్కువగా ఉన్న వారి పేర్లతో ఫేస్​బుక్​లో ఫేక్​ ఐడీలు క్రియేట్​ చేసి.. ఫ్రెండ్​ రిక్వెస్ట్​లను పంపి.. అర్జంట్​ అవసరాలంటూ డబ్బులు కాజేస్తున్నారు. తమవారు ఆపదలో ఉన్నారంటూ ఇంకొందరు బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు నేరగాళ్లు బ్యాంక్​ అకౌంట్​ రెన్యువల్​, క్రెడిట్​, డెబిట్​ కార్డుల వివరాలను అప్​డేట్​ చేస్తున్నామని చెప్తూ.. ఓటీపీలు పంపించి వాటిని తెలుసుకుని సొమ్ము కాజేస్తున్నారు. 

ఏడాది     కేసులు
2018    1,208
2019    2,698
2020    5,006
2021    9,340 

ఎక్కువగా ఆర్థిక నేరాలే
సైబర్​ క్రైమ్​ నేరాల్లో ఎక్కువగా ఆర్థిక సంబంధమైనవే ఉంటున్నాయి. ఫిర్యాదులు వేల సంఖ్యలో వస్తున్నాయి. దీంతో సైబర్​ క్రైమ్​ సిబ్బందికీ అది తలకు మించిన భారమవుతోంది. నిందితుల్లో ఎక్కువ మంది బయటి రాష్ట్రాలకు చెందినోళ్లే ఉంటున్నారని, వారిని అరెస్ట్​ చేసేందుకు వెళ్తే ఇక్కడి కేసుల దర్యాప్తు పెండింగ్​లో పడుతోందని అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదుల్లో కేవలం 35 శాతం కేసులే కొలిక్కి వస్తున్నాయి. ఓ పక్క క్రెడిట్​, డెబిట్​ కార్డ్‌‌ మోసగాళ్లతో పాటు డేటా చోరీ వంటి కేసులూ పెరుగుతున్నాయి. హ్యాకింగ్​, ఎస్​ఎంఎస్​, ఈ–మెయిల్​ మోసాలూ ఎక్కువయ్యాయి. మొత్తం సైబర్​ దాడుల్లో 53 శాతం ఆర్థికపరమైన నష్టాలు కలిగిస్తున్నవనేనని నిపుణులు చెప్తున్నారు.