సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి: సీపీ సజ్జనార్

సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి: సీపీ సజ్జనార్
  • కస్టమర్ నెంబర్ల కోసం సెర్చ్ చేస్తున్న బాధితులే ఎక్కువగా మోసపోతున్నారు
  • అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్: చేతిలో మొబైల్ ఉందని.. ఫ్రీ వైఫై లేదా డేటా ఉందని.. ఆన్ లైన్ లో అనవసరమైనవన్నీ సెర్చ్ చేసేవారు..  చూసే వారు తస్మాత్ జాగ్రత్త. హైదరాబాద్ మహానగరంలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏదైనా వస్తువులు ఆన్ లైన్ లో కొనడం కోసమో.. లేదా కస్టమర్ నెంబర్ల కోసం సెర్చ్ చేస్తున్న బాధితులే ఎక్కువగా మోసపోతున్న కేసులు ప్రతిరోజూ నమోదువుతున్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అలెర్ట్ గా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ట్రాప్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆశల వల విసిరి.. ఏదో ఒక పేరుతో.. బలహీనతలు తెలుసుకుని దోచుకుంటున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరస్తులకు ఒక ప్లేస్ అంటూ ఉండదని, వారికి ఒక ఫోన్ మరియు లాప్ టాప్..  నెట్ ఉంటె సరిపోతుందని.. సైబరాబాద్ లిమిట్స్ లో ప్రతి రోజు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. సైబర్ నేరస్థులు ఎన్ని భాషల్లో అయిన మాట్లాడి చీట్ చేస్తారని.. లాటరీ తీశామని, గిఫ్ట్ వచ్చిందని.. సర్వీస్ టాక్స్ పేర్లతో చీట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు ఫోన్ వాడే విధానాన్ని గుర్తించి ట్రాప్ చేస్తున్నారని.. ఈ మధ్య న్యూడ్ వీడియో కాల్స్ తో టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు వస్తున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. అంతేకాదు క్రెడిట్ కార్డులు.. ఇన్వెస్ట్ మెంట్, లోన్స్ ఇస్తామంటూ మోసాలు చేస్తున్నారని.. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సందేహం వచ్చినా.. అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ కోరారు.