నార్సింగి సైకిల్ ట్రాక్​పై దూసుకెళ్లొచ్చు

నార్సింగి సైకిల్ ట్రాక్​పై దూసుకెళ్లొచ్చు

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని నార్సింగి వద్ద 24 కి.మీ. మేర నిర్మించిన సైకిల్ ట్రాక్​ అందుబాటులోకి వచ్చింది. ట్రాక్​పై సైక్లింగ్​చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. సొంతంగా సైకిళ్లు ఉన్నవారు నేరుగా ట్రాక్​పైకి వెళ్లొచ్చు. లేనివారి కోసం అద్దె సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ఇందుకోసం నార్సింగి హబ్‌‌లో సైకిల్ స్టేషన్‌‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లు, 160 నార్మల్​సైకిళ్లు ఉన్నాయి. సైకిల్​అద్దెను గంటకు రూ.50గా నిర్ణయించారు. గతంలో ఈ సైక్లింగ్​ట్రాక్​ను ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ, సైక్లిస్టులను అనుతించలేదు. కొన్నాళ్లుగా పోకిరీలకు, పశువులకు నిలయంగా మారింది. రాత్రిపూట ఆకతాయులు, మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

సైకిల్‌‌పై ఆఫీసులకు వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు, ఔత్సాహికులు ఈ ట్రాక్​ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చెప్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. స్పందించిన అధికారులు సైక్లింగ్​కు ఓకే చెప్పారు. ఇదిలా ఉండగా సైకిల్ స్టేషన్ల నిర్వహణను హెచ్ఎండీఏ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. పబ్లిక్​అండ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్‌‌రాంగూడ, నార్సింగి, కొల్లూరు వద్ద ఏర్పాటు చేసింది.

ప్రస్తుతానికి నార్సింగి హబ్‌‌లో అద్దెకు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని హెచ్‌‌ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. సైకిల్ ట్రాక్‌‌లో ప్రతి కిలోమీటరు దూరాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా సైకిల్ ట్రాక్‌‌లోకి ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్లు, ట్రాక్ కలరింగ్, సేఫ్టీ సైన్​బోర్డులు పెట్టారు.  మధ్యలో ఆగి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సైక్లింగ్ చేసేందుకు వీలుగా స్పెషల్​లైటింగ్ ఏర్పాటు చేశారు.