
హైదరాబాద్, వెలుగు:
బంగాళాఖాతంలో ‘బుల్‌బుల్’ తుఫాను కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది శనివారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి, ఆ తర్వాత ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని వాతావరణ అధికారులు చెప్పారు.