వణికిస్తున్న ‘మాండౌస్’ తుఫాను.. ఆ రాష్ట్రాలపైనే అత్యధిక ప్రభావం!!

వణికిస్తున్న ‘మాండౌస్’ తుఫాను.. ఆ రాష్ట్రాలపైనే అత్యధిక ప్రభావం!!

ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను మాండౌస్ తుఫాన్ వణికిస్తోంది. సైక్లోన్ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు పుదుచ్చేరిలోనూ నాన్ స్టాప్ వర్షాలు పడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడిన మాండౌస్ సైక్లోన్... తీవ్ర తుఫానుగా మారింది. ఇవాళ  అర్ధరాత్రి తర్వాత తుఫాను తీరం దాటే  అవకాశముందని ఐఎండీ ఆఫీసర్లు అన్నారు. తమిళనాడు, ఏపీలకు మరో 48 గంటల్లో భారీ వర్షం పడే సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.  

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ సైక్లోనో.... ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాండౌస్ తీవ్ర తుఫాన్ నుంచి అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు . తుఫాన్ తీరం దాటే సమయంలో 80 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని IMD పేర్కొంది. మాండౌస్ సైక్లోన్ తమిళనాడు మల్లాపురానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమైందని తెలిపింది. ఇది పుదిచ్చేరి, శ్రీహరికోట మధ్య ఇవాళ అర్ధరాత్రి లేదంటే రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. 

తమిళనాడులో..

తుఫాన్ ముప్పుతో తమిళనాడులోని చెంగలపట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉన్న 12 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గ్రేటర్ చెన్నై పరిధిలోని అన్ని పార్కులు, ప్లే గ్రౌండ్స్ ను మూసివేశారు. మరోవైపు చెన్నై నుంచి బయల్దేరాల్సిన 16 విమానాలను రద్దు చేశారు. అందులో అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే తమిళనాడు ఉత్తర ప్రాంతంలో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీచ్ లలో  షాపులను అధికారులు మూసి వేయించారు. చెన్నైలో  169 సహా  5,093 సహాయ  కేంద్రాలు, తమిళనాడు  అంతటా 121 షెల్టర్లు  ఏర్పాటు చేశారు. చెంగల్పట్టు,  విల్లుపురం,  కాంచీపురం, పుదుచ్చేరిలోని  కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు  కురుస్తాయంటున్నారు అధికారులు. 10 జిల్లాల్లో NDRF  టీమ్ లు మోహరించాయి. తుఫాను హెచ్చరికలతో  కోస్ట్ గార్డ్  చర్యలు  తీసుకుంటోంది. ఫిషింగ్ బోట్లను హార్బర్ కు తిరిగి రావాలని ఆదేశించారు.

ఏపీలో..

ఏపీపైనా మాండౌస్ తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. తిరుపతి జిల్లాలో భారీ వర్షం పడుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  మరో 48 గంటలు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం  ఉందని  వాతావరణ శాఖ  అధికారులు హెచ్చరించారు. మిగిలిన చోట్ల తేలికపాటి  నుంచి మోస్తరు వర్షాలు  పడతాయని  తెలిపారు. తుఫాన్ ప్రభావం చూపే జిల్లాల్లో అధికారులను అప్రమత్తం  చేసింది ప్రభుత్వం . సహాయ చర్యల కోసం  మొత్తం 5 NDRF , 4 SDRF  టీములు రెడీగా ఉన్నాయి.

పుదుచ్చేరిలో ..

తుఫాను ప్రభావంతో పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితులపై అధికారులతో సీఎం ఎన్ రంగస్వామి రివ్యూ చేశారు . అధికారులు, సిబ్బందితో కలిసి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. రాష్ట్రంలో 238  సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు రంగస్వామి.