రైతుల గుండెల్లో తుఫాన్.. కన్నీరు మిగిల్చిన ‘మొంథా’

రైతుల గుండెల్లో తుఫాన్.. కన్నీరు మిగిల్చిన ‘మొంథా’
  •  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 53,704 ఎకరాల్లో పంట నష్టం

వెలుగు, నెట్​వర్క్: మొంథా తుఫాన్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా రైతులను నిండా ముంచింది. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొత్తం 53,704 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.  ఎల్​ఎండీకి 66 వేల క్యూసెక్కుల వరద రాగా.. అధికారులు దిగువకు వదులుతున్నారు.

కరీంనగర్​ జిల్లాలో 34,127 ఎకరాల్లో నష్టం

జిల్లాలోని 183 గ్రామాల్లో 29,797 మంది రైతులకు చెందిన 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 30 వేల ఎకరాల వరకు వరి పంట ఉంది. క్రాప్ డ్యామేజీతోపాటు ఇప్పటికే కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరి సుమారు 2,036 టన్నుల ధాన్యం తడిసింది. 8 పశువులు మృత్యువాత పడ్డాయి. గన్నేరువరం, పారువెల్ల, జంగాపల్లి చెరువుల వద్ద లోలెవెల్ కల్వర్టులపై వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

అలుగునూర్ లోని మామిడికుంట చెరువు నాలా కబ్జా చేయడంతో వరద నీరు కాలనీని ముంచెత్తింది. తుమ్మలచెరువు కట్టు కాలువ తెగడంతో ఘన్ పూర్–సైదాపూర్ రోడ్డుపై వరద ప్రవహించింది. హుస్నాబాద్–హుజురాబాద్ మార్గంలోని సమ్మక్కల గుట్ట వద్ద మీటర్ ఎత్తుతో రహదారిపై నీరు వెళ్లడంతో ఎగ్లాస్ పూర్,- సోమారం గ్రామాల మధ్యలో కల్వర్టుపై వాగు ఉధృతంగా ప్రవహించింది. మొలంగూర్ – సైదాపూర్ రహదారిపై ఆరబెట్టిన వడ్లు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి. .

 జగిత్యాల జిల్లాలో 19,128 ఎకరాల్లో..  

జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కలాల్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. మొత్తం 19,128 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులుప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 17,982 ఎకరాల వరి, 1,146 ఎకరాల పత్తి పంట ఉన్నాయన్నారు. చల్ గల్, వెల్దుర్తి, తిప్పన్నపేట్, మెట్​పల్లి మండలం వెల్లుల్ల, కోరుట్ల, ఫకీర్ కొండాపూర్ గ్రామాల్లో పంటలకు ఎక్కువగా నష్టం జరిగింది.  జగిత్యాల, కోరుట్లలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి.    

 రాజన్న సిరిసిల్లలో 178 ఎకరాల్లో..

జిల్లాలో 178 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ లో ఐకేపీ సెంటర్ లోకి నీరు చేరడంతో ధాన్యం తడిసి మొలకలొచ్చింది. నిజామాబాద్ సెంటర్​లోని పలువురు రైతుల వడ్లు కొట్టుకుపోయాయి. నిమ్మపల్లి ప్రధాన రహదారి పెంటివాగు కాజ్ వే కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

 కోనరావుపేట మండలంలోని మూలవాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. తంగళ్లపల్లి మండలంలోని కస్బెకట్కూర్, చింతలపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటమునిగింది. దాచారం బానప్ప చెరువుకు గండి పడటంతో పక్కనే ఉన్న రామచంద్రాపూర్ లోని పంట పొలాలు నీటిమునిగాయి. .

పెద్దపల్లి జిల్లాలో 271 ఎకరాల్లో.. 

జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వానకు 196 మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి నేలవాలింది. పలుచోట్ల పత్తి చేలల్లోనే రాలిపోయింది. ఎలాంటి ఆస్తి , ప్రాణ నష్టం జరగలేదు.