ముంచుకొస్తున్న నివార్‌‌ తుఫాన్

ముంచుకొస్తున్న నివార్‌‌ తుఫాన్
  • గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు
  • చెన్నై సహా ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు
  • జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారుల వార్నింగ్

పుదుచ్చేరి/న్యూఢిల్లీ:   సైక్లోన్ నివార్ ముప్పు ముంచుకొస్తోంది. ఇయ్యాల తీరం దాటనున్న తీవ్ర పెను తుఫాన్‌ నివార్.. పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. తీర ప్రాంత జిల్లాలపై సైక్లోన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నివార్ తుఫాన్ బుధవారం సాయంత్రం తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. చాలాచోట్ల తుఫాన్ గాలుల ధాటికి చెట్లు కూలిపోవచ్చని, కరెంట్ స్తంభాలు విరిగిపడి, సరఫరా ఆగిపోవచ్చని, కమ్యూనికేషన్స్ కు అంతరాయం కలగొచ్చని, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవచ్చని, వర్షాలతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తవచ్చని అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావంతో చెన్నై సిటీతో సహా సముద్ర తీర జిల్లాల్లోభారీ వానలు కురుస్తున్నాయి. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని చెన్నైలోని ఐఎండీ ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ ఎన్. పువియరసన్ హెచ్చరించారు. తుఫాన్ కారణంగా ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

పుదుచ్చేరిలో 144 సెక్షన్

నివార్ తుఫాన్ తో ప్రాణనష్టాన్ని తప్పించేందుకు పుదుచ్చేరిలో 144 సెక్షన్ విధించారు. మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు షాపులన్నీ మూసివేయాలని ఆదేశించారు. సైక్లోన్ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ సిబ్బందికి, పాలు, ఇతర నిత్యావసర సరుకుల సప్లైకి, పెట్రోల్ బంకులు, ఫార్మసీలు, హెల్త్ సర్వీసులకు మినహాయింపును ఇచ్చారు.

 ఏపీ, తమిళనాడు, కేరళలో రైళ్లు రద్దు

తుఫాన్ కారణంగా ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మూడు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.  తిరువనంతపురం డివిజన్‌లో 6 రైళ్లు రద్దు చేశామన్నారు.

30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీ

తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) 30 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడులో 12, పుదుచ్చేరిలో 3, ఏపీలో 7 టీమ్ లు రెడీగా ఉన్నాయన్నారు. మరో 8 టీమ్లను సిద్ధం చేసినట్లు చెప్పారు.

తమిళనాడు, పుదుచ్చేరికి అండగా ఉంటాం: మోడీ

నివార్ తుఫాన్ తో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ‘‘తమిళనాడు సీఎం పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో ఫోన్ లో మాట్లాడాను. కేంద్రం తరఫున అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటామని భరోసా ఇచ్చాను. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా..” అని ప్రధాని ట్వీట్ చేశారు. సైక్లోన్ ముప్పు గురించి ప్రధాని మోడీకి ఫోన్ ద్వారా వివరించానని నారాయణ స్వామి చెప్పారు.

నేడు తమిళనాడులో సెలవు

తుఫాన్‌ ప్రభావంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన తమిళనాడు సర్కార్ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. మరో వైపు కల్పక్కం సమీపంలోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ పై సైక్లోన్ నివార్ ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పింది.