దూసుకొస్తున్న శక్తి తుఫాన్‌‌‌‌

దూసుకొస్తున్న శక్తి తుఫాన్‌‌‌‌

న్యూఢిల్లీ: శక్తి తుఫాన్‌‌‌‌తో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్‌‌‌‌ తీరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తుఫాను ప్రభావం వల్ల గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని శనివారం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర తుఫానుగా మారిన ‘శక్తి’.. అరేబియా సముద్రంలో గుజరాత్‌‌‌‌లోని ద్వారకాకు 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. 

ఆదివారం నాటికి పశ్చిమ నైరుతి దిశగా కదిలి వాయవ్య, పశ్చిమ మధ్య అరేబియా సముద్రానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం నుంచి శక్తి తుఫాను తిరిగి తూర్పు ఈశాన్య దిశగా కదిలి, తర్వాత బలహీనపడుతుందని పేర్కొంది. ఈ తుఫాను ప్రభావంతో గుజరాత్‌‌‌‌, మహారాష్ట్ర, పాకిస్తాన్‌‌‌‌ తీరం వెంబడి ఆదివారం సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మంగళవారం వరకు గుజరాత్‌‌‌‌, మహారాష్ట్ర మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.