పెరుగుతో అదిరిపోయే క్రిస్పీ స్నాక్ దహీ కీ షోలే.. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు..

 పెరుగుతో అదిరిపోయే క్రిస్పీ స్నాక్ దహీ కీ షోలే.. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు..

వేసవిలో చల్లగా, రుచిగా తినాలనిపిస్తే పెరుగుతో చేసే వంటలు బెస్ట్ ఆప్షన్. సాధారణంగా పెరుగును భోజనంతో మాత్రమే తింటాం. కానీ అదే పెరుగుతో టేస్టీగా   క్రిస్పీ దహీ కీ షోలే లాంటి వెరైటీ వంటలు కూడా చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఈజీగా తయారయ్యే ఈ రెసిపీ  పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేస్తాయి......

దహీ కీ షోలే

కావాల్సినవి :
పెరుగు - 400 గ్రాములు
ఉల్లిగడ్డ, చీజ్ క్యూబ్ - ఒక్కోటి
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - మూడు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు, నూనె, నీళ్లు - సరిపడా
జీడిపప్పులు, ఎండుద్రాక్షలు, శనగపిండి - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర పొడి - రెండు టీస్పూన్లు
యాలకుల పొడి, మిరియాల పొడి, నువ్వులు, చిల్లీఫ్లేక్స్ - ఒక్కో టీస్పూన్​
జీలకర్ర, చాట్ మసాలా, నల్ల ఉప్పు - ఒక్కోటి అర టీస్పూన్
పనీర్ - 50 గ్రాములు
బొంబాయి రవ్వ - ఒక కప్పు


తయారీ:
 ఒక గిన్నెలో జల్లెడ పెట్టి దానిపై కాటన్ క్లాత్ వేసి అందులో గడ్డ పెరుగు వేయాలి. పెరుగులో చుక్క నీరు లేకుండా గట్టిగా పిండి, దానిపై బరువు పెట్టి పక్కన పెట్టాలి. పాన్ లో నీళ్లు పోసి, నూనె, నువ్వులు, చిల్లీఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర, బొంబాయి రవ్వ వేసి ఉండలు లేకుండా కలపాలి. ముద్దగా అయిన తర్వాత అందులో నూనె వేసి మరోసారి కలిపి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో రెడీ చేసుకున్న పెరుగు ముద్దను వేసి, అందులో అల్లం తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఉల్లిగడ్డ తరుగు, చీజ్ వేసి బాగా కలపాలి. ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, యాలకుల పొడి, నల్ల ఉప్పు, శనగపిండి వేసి కలపాలి. బొంబాయి రవ్వ ముద్దను చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కోదాన్ని అరచేతిలో ఒత్తి అందులో పెరుగు మిశ్రమం పెట్టి మళ్లీ ఉండచేయాలి. పొంగనాల పాన్లో నూనె వేసి వాటిలో ఉండల్ని పెట్టి రెండు వైపులా కాల్చాలి... అంతే దహీ కీ షోలే రెడీ....