హెల్త్‌ టెస్టులు ‘డోర్‌ డెలివరీ’

హెల్త్‌ టెస్టులు ‘డోర్‌ డెలివరీ’
  • విస్తరిస్తున్న హోమ్‌ డయాగ్నసిస్ ట్రెండ్
  • ఆన్‌ లైన్‌ లో బుక్‌ చేసుకుం టే ఇంటికొచ్చి శాంపిల్స్‌ తీసుకెళ్తున్న టెక్నీషియన్స్
  • సాయంత్రానికల్లా రిపోర్ట్‌‌ డాక్టర్‌ ఉచిత కన్సల్టేషన్‌
  • తక్కువ ధరల్లో ప్యాకేజీలు ఆన్‌ లైన్‌ కంపెనీల స్టడర్డ్స్‌ పై అనుమానాలు

హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌‌ ఫోన్‌‌ చేతిలో ఉంటే చాలు.. ఏం కావాలన్నా కాలు బయట పెట్టకుండా చేతులదాకా వచ్చేస్తున్న రోజులివి. ఫుడ్డు కానించి.. అన్ని సేవలకు ‘జీ హుజూర్‌‌’ అంటూ అనేక కంపెనీలు ఆన్‌‌లైన్‌‌లో క్యూ కడుతున్నాయి. తాజాగా హెల్త్‌‌ టెస్టులు చేసే డయాగ్నస్టిక్‌‌ సెంటర్లూ ‘హోమ్ డెలివరీ’ బాట పట్టాయి. తక్కువ ధరకే పదుల సంఖ్యలో టెస్టులు ఆఫర్‌‌ చేస్తున్నాయి. ఆన్‌‌లైన్‌‌లో బుక్ చేసుకుంటే టెక్నీషియన్‌‌ వచ్చి బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌‌ తీసుకెళ్లి సాయంత్రం వరకు రిజల్ట్స్‌‌ ఇచ్చి వెళ్తున్నారు. కొన్ని కంపెనీలు డాక్టర్‌‌ కన్సల్టేషన్‌‌ను ఫ్రీగా ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు హెచ్‌‌బీఏ1సీ, బ్లడ్ షుగర్, సీబీసీ, లిపిడ్ ప్రొఫైల్‌‌, కిడ్నీ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, విటమిన్ లెవెల్స్ ఇలా రకరకాల టెస్టుల్ని రూ.ఐదారు వందలకే చేస్తున్నాయి.

జాగ్రత్తగా ఉండాలి

ఒకే రకం టెస్ట్‌‌కు ఓ సంస్థ రూ.వేలల్లో, మరో సంస్థ రూ.వందల్లో చార్జ్‌‌ చేస్తోంది. ఆయా సంస్థలు వాడుతున్న పరికరాలు, టెస్ట్ కిట్లు, కెమికల్స్ నాణ్యతను బట్టి రేట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం కిట్లు, కెమికల్స్ వాడితే రిజల్ట్‌‌లో తేడా వచ్చే ప్రమాదముందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓ ఆన్‌‌లైన్‌‌ సంస్థ ద్వారా టెస్టు చేయించుకుంటే షుగర్ ఉన్నట్టు తేలింది. దీంతో గాబరా పడిపోయి ఫ్యామిలీ డాక్టర్‌‌‌‌ను కలిసి టెస్ట్‌‌ చేయించుకుంటే షుగర్ నార్మల్‌‌గానే ఉన్నట్టు తేలింది. ఇటీవల డెంగీ సీజన్‌‌లో ప్లేట్‌‌లెట్స్ కౌంట్ విషయంలోనూ చాలా మంది ఇలాగే మోసపోయారు.

ఇవి చెక్‌‌ చేయాలి

హాస్పిటల్స్‌‌కు సర్వీస్‌‌ ఆధారంగా కొన్ని సంస్థలు రేటింగ్ ఇస్తున్నాయి. డయాగ్నస్టిక్ సెంటర్లకూ నేషనల్‌‌ అక్రెడిటేషన్‌‌ బోర్డ్‌‌ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్‌‌ (ఎన్‌‌ఏబీఎల్‌‌) సంస్థ రేటింగ్‌‌ ఇస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌‌లో ఈ బోర్డ్ పనిచేస్తుంది. వీటిని చెక్‌‌ చేసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

అడిగేవారేరి?

రాష్ట్రంలో ఎన్ని డయాగ్నస్టిక్​ సెంటర్లున్నాయో కూడా హెల్త్ డిపార్ట్‌‌మెంట్ దగ్గర వివరాల్లేవు. అనుమతులిచ్చేటప్పుడే ల్యాబ్‌‌లను పరిశీలిస్తారని, ఆ తర్వాత పట్టించుకోరని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ఇక్కడ సాంపిళ్లు సేకరించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న సంస్థలపై నిఘా ఉండదని, వాటిని ఎలా నియంత్రించాలో నిబంధనల్లో లేదన్నారు.

ఎన్‌‌ఏబీఎల్ చూడాలె

ఇప్పుడిప్పుడే హోమ్ డెలివరీ డయాగ్నసిస్ సేవలు పెరుగుతున్నాయి. ఏ బిజినెస్‌‌ అయినా, స్టార్టింగ్‌‌లో మార్కెటింగ్ కోసం తక్కువ ధరలకే సర్వీస్‌‌ చేస్తాయి. ఇదికూడా అంతే. డయాగ్నస్టిక్​ సెంటర్లకు ఎన్‌‌ఏబీఎల్ మంచి గుర్తింపు. నెలకు 2 లేదా 3 సార్లు ఎన్‌‌ఏబీఎల్ ప్రతినిధులు ల్యాబ్‌‌లను చెక్ చేస్తారు. టెస్టులు చేపించుకునేవాళ్లు దీన్ని నమ్మొచ్చు.

– డాక్టర్ రమణి, పాథాలజిస్ట్​,మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్‌‌