తీహార్‌ జైలు సూపరింటెండెంట్ తో మంత్రి సత్యేందర్ జైన్ సంభాషణ

తీహార్‌ జైలు సూపరింటెండెంట్ తో మంత్రి సత్యేందర్ జైన్ సంభాషణ

ఢిల్లీ : ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్ గురించి రోజుకో వార్త బయటికొస్తోంది. మొన్న మసాజ్.. నిన్న బయటి ఫుడ్.. ఇవాళ ఏకంగా జైలు అధికారితో సంభాషణ. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. తీహార్‌ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్..రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. 

తీహార్‌ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్.. మసాజ్‌ చేయించుంటున్న వీడియోలు, ఫ్రూట్‌ సలాడ్‌ తింటున్న వీడియోలు బయటకు రావడంతో ఆప్ సందిగ్ధంలో పడింది. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. తీహార్ జైలు అధికారులతోనే మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ తో మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియో సెప్టెంబర్ 12వ తేదీ నాటిదని తెలుస్తోంది. ఓ వైపు గుజరాత్ ఎన్నికలు, మరోవైపు ఎంసీడీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న ఆప్ కు.. సత్యేందర్ జైన్ వీడియోలు తలనొప్పిగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.