IPO News: ఒక్క చుక్క కూడా పాలు అమ్మని డెయిరీ సంస్థ.. రూ.2వేల కోట్ల ఐపీవోతో మార్కెట్లోకి..

IPO News: ఒక్క చుక్క కూడా పాలు అమ్మని డెయిరీ సంస్థ.. రూ.2వేల కోట్ల ఐపీవోతో మార్కెట్లోకి..

Milky Mist IPO: జూలై నెల దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పటికీ మార్కెట్లోకి వస్తున్న ఐపీవోల రద్దీ మాత్రం అస్సలు తగ్గటం లేదు. మార్కెట్లలో ఈక్విటీలతో పోల్చితే ప్రస్తుతం ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య అధికంగా ఉంది. మార్కెట్ల ఒడిదొడుకులతో పాటు కొంత అధిక విలువల వద్ద ట్రేడింగ్ దీనికి కారణంగా తెలుస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మిల్కీ మిస్త్ కంపెనీ ఐపీవో గురించే. ఈ సంస్థను 1994లో ఒక స్కూల్ డ్రాపౌట్ టి. సతీష్ కుమార్ నేతృత్వంలో కొనసాగుతోంది. తమిళనాడు ఇరోడ్ ప్రాంతంలో తమకు ఉన్న ఫ్యామిలీ పాల వ్యాపారం కోసం చదువు మానేయాల్సి వచ్చింది. అయితే మూడు దశాబ్ధాల తర్వాత వ్యాపారాన్ని రూ.2వేల కోట్ల విలువైన డెయిరీ సంస్థగా తీర్చిదిద్దారు సతీష్.

అప్పట్లో పాల వ్యాపారంలో తక్కువ లాభాలతో పాటు ఉన్న కొన్ని ఇతర ఇబ్బందులతో పాలను విక్రయించటం మానేసి పనీర్ వ్యాపారంతో ముందుకొచ్చాడు సతీష్. 1995 నుంచి పాల వ్యాపారం నుంచి బయటకొచ్చి ఇతర పాల ఉత్పత్తులతో ముందుకెళుతోంది కంపెనీ.  పాల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటు అధిక మార్జిన్ లాభాలు ఉండటమే పనీర్ వ్యాపారంలో ఎంట్రీకి కారణంగా సతీష్ చెబుతున్నారు. 

దేశవ్యాప్తంగా 67వేల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్న కంపెనీకి పెరందురాయ్ ప్రాంతంలోని 55 ఎకరాల్లో రోజుకు లక్షన్నర లీటర్ల పాలు ప్రాసెస్ చేసే ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ ఉంది. ప్రస్తుతం సంస్థ పన్నీర్, పెరుగు, ఫ్లేవర్డ్ యోగట్, నెయ్యి, వెన్న, ఐస్ క్రీమ్స్, ఇతర డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 

ప్రస్తుతం సంస్థ రూ.2వేల 035 కోట్ల మెగా ఐపీవోతో మార్కెట్లోకి వస్తోంది. ఇందులో రూ.వెయ్యి 785 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. రూ.250 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ల వాటా విక్రయాలు ఉన్నాయి. సంస్థ తాజా ఐపీవో నుంచి వచ్చిన మెుత్తంలో రూ.750 రుణాన్ని తిరిగి చెల్లించటానికి ఉపయోగించనుంది. రూ.415 కోట్లను యోగట్, చీజ్ ఉత్పత్తిని విస్తరించేందుకు వాడబోతోంది. అలాగే రూ.129 కోట్లను తమ శీతలీకరణ సామర్థ్యాలను విస్తరించటానికి వాడాలని నిర్ణయించింది. ఐపీవోకి సంబంధించిన ప్రైస్ బ్యాండ్, ఇష్యూ వివరాలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది. 

కంపెనీ 15వేలకు పైగా షాపు యజమానులకు ఫ్రిజ్డ్ లు అందించింది. అలాగే రైతులకు పశువుల ఆరోగ్య సేవలు, దాణాపై సబ్సిడీలు, ఆర్థిక సహాయం వంటి సౌకర్యాలను సంస్థ అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.2వేల 350 కోట్ల ఆదాయంతో రూ.46 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.