బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుతో మునిగిన పాడి రైతులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుతో మునిగిన పాడి రైతులు
  • డెయిరీ యూనిట్ల కోసమంటూ రూ. 3.5 లక్షల చొప్పున వసూలు
  • బెల్లంపల్లి ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుల పరస్పర ఆరోపణలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజిన్ ​డెయిరీ నిర్వాహకుల గొడవలో పాడి రైతులు బలయ్యారు. బర్రెల యూనిట్​కోసం రైతులు చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు కొంత కడితే మిగతా మొత్తం కంపెనీ లోన్ ద్వారా బర్రెలు ఇస్తామని చెప్పడంతో చాలామంది అప్పులు చేసి చెల్లించారు. తీరా వారికి బర్రెల యూనిట్లు రాక, డెయిరీకి కట్టిన పైసలు రాక ఇబ్బందులు పడుతున్నారు. డెయిరీ ఫామ్ పెట్టుకుని ఎంతో కొంత బాగుపడుదామనుకుంటే ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చిందని వాపోతున్నారు. 

మంచిర్యాల, వెలుగు: ఆరిజిన్ ​డెయిరీ మంచిర్యాల జిల్లాలో గత ఏడాది మేలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఏజెంట్ల ద్వారా రైతులను మెంబర్లుగా చేర్చుకున్నారు. రైతులకు డెయిరీ యూనిట్​ కింద పది బర్రెలు ఇస్తామని చెప్పారు. యూనిట్​కాస్ట్​ రూ.10 లక్షలకు గాను రైతుల వాటాగా రూ.3.50 లక్షలు (35 శాతం) చెల్లిస్తే మిగతా రూ.6.50 లక్షలు (65 శాతం) ​ డెయిరీ ద్వారా లోన్​ ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రైతులు చేతిలో పైసలు లేకున్నా అప్పులు తెచ్చి కంపెనీకి వాటాధనం చెల్లించారు. అలాగే ఒక్కో బర్రెకు రూ.708 చొప్పున వసూలు చేసి పాడి రైతులను మెంబర్లుగా చేర్చుకున్నారు. బర్రెలు సహజంగా చనిపోతే రూ.5 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే దాని విలువలో 80 శాతం లేదా గరిష్ఠంగా రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. రైతుల నుంచి సేకరించిన పాలకు మార్కెట్​ రేటు కంటే రూ.2 ఎక్కువే చెల్లిస్తామని చెప్పడంతో చాలామంది రైతులు ఆరిజిన్​ డెయిరీ పట్ల ఆకర్షితులయ్యారు. 

ఎమ్మెల్యే తీరుతో మునిగిన రైతులు

ఆరిజిన్​ డెయిరీకి ఇప్పటివరకు ఒక్క బల్క్​మిల్క్​ కూలింగ్​ యూనిట్ (బీఎంసీయూ) కూడా లేదు. ఇంతవరకు లీటరు పాలను కూడా రైతుల దగ్గర నుంచి సేకరించింది లేదు. డెయిరీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులు సైతం లేవు. అయినప్పటికీ బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటు వెనుక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కీలకంగా వ్యవహరించారు. కన్నాల శివారులో నేషనల్​ హైవే 363 పక్కన కోట్ల విలువైన రెండెకరాల అసైన్డ్​ భూమిని డెయిరీకి అప్పగించారు. కొంతమంది తన బంధువులకు డెయిరీలో ఉద్యోగాలు ఇప్పించారు. నిరుడు ఆగస్టులో బీఎంసీయూ నిర్మాణానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నీ తానై వ్యవహరించారు. అరిజిన్​ డెయిరీ రాకతో నియోజకవర్గంలోని పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఓ పాడి రైతుకు డెయిరీ యూనిట్​కింద పది బర్రెలను అందజేశారు. ఇదంతా చూసిన రైతులు వెనుకాముందు ఆలోచించకుండా డెయిరీలో సభ్యులుగా చేరడంతో పాటు బర్రెల కోసం డబ్బులు కట్టారు. ఇలా జిల్లాలోని పాడి రైతుల నుంచి సుమారు రూ.కోటి వరకు వసూలు చేశారు.  

డబ్బులు రికవరీ అయ్యేనా? 

ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుల మధ్య వ్యవహారం చెడిపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. నిర్వాహకులు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినప్పటికీ గడువులోగా బర్రెలు ఇవ్వలేదు. దీంతో డెయిరీ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ పలువురు రైతులు ఈ ఏడాది జనవరి 13న ఏకకాలంలో నియోజకవర్గంలోని వివిధ పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పాడి రైతులు న్యాయం చేయాలంటూ తన వద్దకు రాగా ఆదినారాయణ, శేజల్​ను తానే పోలీసులకు పట్టించానని ఎమ్మెల్యే చిన్నయ్య మీడియాకు వెల్లడించారు. ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. కానీ రైతులు చెల్లించిన డబ్బులను ఇంతవరకు రికవరీ చేయలేదు. డెయిరీ నిర్వాహకులు లోన్​ష్యూరిటీ కింద రైతుల దగ్గర నుంచి తీసుకున్న ఖాళీ చెక్కులను కూడా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేదు. నిందితులను అరెస్ట్​ చేసి రెండున్నర నెలలు గడుస్తున్నా చార్జీషీట్​ఫైల్​చేయలేదు. ఇప్పటికీ ఎంక్వైరీ జరుగుతోందనే చెప్తున్నారు. ఆదినారాయణపై అత్తిలి, గుడివాడ, పంజాగుట్ట, మాదాపూర్​ పోలీస్​స్టేషన్లలో ఇదివరకే పలు కేసులు నమోదుకావడం గమనార్హం.  ఎమ్మెల్యే తమను మోసం చేశాడని ఆరిజిన్​డెయిరీ నిర్వాహకులు ఆరోపిస్తుండగా.. ఆరోపణలన్నీ అవాస్తవమని ఎమ్మెల్యే అంటున్నారు. కానీ డబ్బులు కట్టిన తమ పరిస్థితి ఏంటనేది మాత్రం ఎవరూ మాట్లాడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.