మెసెజ్ వచ్చినా అకౌంట్లో దళితబంధు డబ్బులు పడలే

మెసెజ్ వచ్చినా అకౌంట్లో దళితబంధు డబ్బులు పడలే
  • అకౌంట్ల పైసలు పడ్డయా.. లేదా?
  • హుజూరాబాద్​లో దళితబంధు లబ్ధిదారుల పరేషాన్​

కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీం అమలులో సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. స్కీంకు పైలట్ ​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఈ నియోజకవర్గంలో మొత్తం 23 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆఫీసర్లు సుమారు 17 వేల అకౌంట్లలో రూ.10 లక్షల చొప్పున జమ చేశామని చెబుతున్నారు. ఇంకా సుమారు 6 వేల మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఈలోగా రెండు రోజుల కింద ఎన్నికల షెడ్యూల్ రిలీజ్​ అయ్యింది. వెంటనే కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో చాలామంది లబ్ధిదారులు జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో ఉన్న బ్యాంకుల్లో తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ ​చేసుకుంటున్నారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచే బ్యాంకుల ఎదుట బారులు తీరి కనిపించారు. ఆయా మండలాల్లో బ్యాంకుల వద్ద దళిత బంధు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్​ల వద్దకు చేరుకుని వారి అకౌంట్లలో క్యాష్​ పడిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వింత అనుభవాలు ఎదురయ్యాయి. రూ.9.90 లక్షలు క్రెడిట్​అయినట్లు సెల్ ఫోన్ మెసేజ్ వచ్చిన కొందరికి  బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడలేదని చెప్పడంతో షాక్​అయ్యారు. ఇంకొందరికి ఎలాంటి సాంక్షన్ లెటర్లు, మెసేజ్​లు రాకున్నా అకౌంట్లలో డబ్బులు క్రెడిట్​ అయ్యాయి. దళిత ప్రజాప్రతినిధులు, వారి తరఫు బంధువులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరి అకౌంట్లలో డబ్బులు పడ్డాయని, కూలినాలి చేసుకునే తమకు మాత్రం పడలేని బ్యాంకుల వద్దే పలువురు విమర్శించారు.

మెసే​జ్​ వచ్చింది.. పైసల్​ పడలే

నా అకౌంట్​లో పైసలు పడ్డట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వచ్చి చెక్​చేస్తే పైసలు పడలేదని చెప్పిన్రు. మా ఊళ్లో దళిత లీడర్లకు, నాన్ లోకల్ గా ఉండే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల అకౌంట్లలో పైసలు పడ్డయి. మాలాంటి కూలి, నాలి చేసుకుని బతికే కుటుంబాలకు మాత్రం పైసలు పడలేదు. 

- మాట్ల రాజు, మడిపల్లి, జమ్మికుంట

ట్రాక్టర్ ​తీసుకుందామనుకున్న

సర్వే చేసిన రెండు రోజులకే నాకు డబ్బు క్రెడిట్​అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇంటిల్లిపాది  సంబరపడ్డాం. నేను డ్రైవర్ ను. లైసెన్స్ ఉంది. ట్రాక్టర్ తీసుకుందామని అనుకున్న. కొటేషన్ కూడా తీసుకున్న. కానీ బ్యాంక్ కు వచ్చేసరికి దళితబంధు పైసలు పడలేదని తెలిసింది. ఏం చేయాల్నో తోస్తలేదు. 

-ఇల్లందుల రాజు, జూపాక, హుజూరాబాద్