దళితులు లేని గ్రామానికి దళితబంధు

దళితులు లేని గ్రామానికి దళితబంధు
  •     పథకం కోసం     పక్క గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి 
  •     అతడికి స్కీం ఇవ్వొద్దంటూ     గ్రామస్తుల తీర్మానం

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్  మండలంలోని ఎక్బాల్ పూర్ గ్రామానికి  దళితబంధు పథకం  మంజూరు కావడం వివాదాస్పదమవుతోంది. ఈ గ్రామంలో ఒక్క దళిత కుటుంబం కూడా లేకపోవడంతో గ్రామానికి  దళితబంధు వర్తించదని గ్రామస్తులు భావించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ  గ్రామ నివాసినంటూ ఖానాపూర్ కు చెందిన పిరాజీ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. పిరాజీ సొంత గ్రామం ఖానాపూర్ అయినప్పటికీ ఆయనకు ఎక్బాల్ పూర్ లో నివాస స్థలంతోపాటు వ్యవసాయ భూమి ఉంది. ఎక్బాల్ పూర్ కు దళితబంధు పథకం వర్తించబోతున్నట్లు తెలియడంతో పిరాజీ తాను అదే గ్రామస్తుడిన౦టూ ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు  చేయించుకున్నాడు. ఆ గ్రామంలో తనకున్న చిన్న స్థలంలో ఇల్లు కట్టే ప్రయత్నం కూడా మొదలుపెట్టాడు. దీనిని  గమనించిన గ్రామస్తులు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. శనివారం గ్రామంలో గ్రామసభ  నిర్వహించారు. ఈ సందర్భంగా పిరాజీ తమ గ్రామస్తుడు కాదని, ఆయన కేవలం దళితబందు పథకం కోసమే ఇక్కడి వ్యక్తిగా సర్టిఫికెట్లు సృష్టించుకున్నాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. అతనికి ఎట్టిపరిస్థితుల్లో దళితబంధు పథకాన్ని మంజూరు చేయవద్దంటూ సర్పంచ్​తోపాటు గ్రామపెద్దలు గ్రామసభలో తీర్మానించారు. అయితే దళిత కుటుంబాలు ఎక్కువ ఉన్న గ్రామాలను పక్కనపెట్టి ఎక్బాల్ పూర్ లో దళితులు లేకున్నా ఒక్కరి కోసం ఈ  పథకాన్ని వర్తింపజేస్తామంటూ అధికారులు ముందుకు రావడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. ఈ  వ్యవహారం వెనుక  రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న  ప్రచారం జరుగుతోంది.