ఆలయాల్లోకి రానివ్వనందుకే చర్చీలకు... ఎస్సీ రిజర్వేషన్లలో సుప్రీం తీర్పుపై కేవీపీఎస్ ఆందోళన

ఆలయాల్లోకి రానివ్వనందుకే చర్చీలకు... ఎస్సీ రిజర్వేషన్లలో సుప్రీం తీర్పుపై కేవీపీఎస్ ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో గుళ్లలోకి రానివ్వనందుకే దళితులు చర్చిలకు వెళ్తున్నారని కుల వివక్ష పోరాట సమితి(కేవీపీఎస్) తెలంగాణ సెక్రటరీ మాల్యాద్రి అన్నారు. సామాజిక న్యాయం కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో తాము ఏకీభవించట్లేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

రిజర్వేషన్ల అసలు లక్ష్యం మత గుర్తింపు కాదు, సామాజిక స్థితిగతులేనని పేర్కొంది. సీపీఎం జాతీయ నేత బి.వెంకట్ ఢిల్లీలో మాట్లాడుతూ, మతానికే ప్రాధాన్యమా? మరి.. సామాజిక స్థితిగతుల సంగతేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్లు, ఇతర రక్షణలు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రూపొందించినవేనని గుర్తు చేశారు. తాజా తీర్పు సామాజిక స్థితిగతుల కంటే మతపరమైన గుర్తింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.