- టీజీఎంఎస్ఐడీసీని ప్రక్షాళన చేయాలని మంత్రి దామోదర ఆదేశం
- మందుల కొనుగోళ్ల టెండర్లలో పారదర్శకతకు 5 కమిటీల నిఘా
- అన్ని ఆస్పత్రుల్లో ఒకే రకమైన మెడికల్ ఎక్విప్మెంట్లు
- గైడ్‌లైన్స్ రెడీ చేయాలని అధికారులకు ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) సంస్థలో ఏండ్ల తరబడి ఒకే విభాగంలో తిష్టవేసిన అధికారులను తక్షణమే బదిలీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అడ్మినిస్ట్రేషన్‌లో జవాబుదారీతనం ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్) పనితీరుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి అధికారులపై సీరియస్ అయ్యారు.
మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియలో పారదర్శకత కోసం పర్యవేక్షించే ప్రస్తుతం ఉన్న రెండు కమిటీలకు అదనంగా మరో మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతినెలా కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే, డీఎంఈ , టీవీవీపీ ఆస్పత్రుల్లో జరుగుతున్న సివిల్ పనులు, ఎక్విప్మెంట్ కొనుగోళ్లను రెగ్యులర్‌గా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు.
మెడిసిన్ స్టోర్లకు సొంత భవనాలు..
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న 15 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల (సీఎంఎస్) కోసం శాశ్వత భవనాలను నిర్మించాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. మందుల సరఫరాను మరింత వేగవంతం చేసేందుకు 'క్యూర్' ఏరియాలో ప్రస్తుతం ఉన్న 2 కేంద్రాలకు అదనంగా మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య పరికరాల విషయంలో ఏకరూపత ఉండేలా ‘స్టాండర్డ్ ఎక్విప్మెంట్ లిస్ట్’ను తయారు చేయాలని సూచించారు.
అలాగే, హిమోఫిలియా అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ‘ఎమిసిజుమాబ్’ ఇంజక్షన్లను ఇకపై వరంగల్, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లోనూ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్పొరేషన్ ఎండీ గౌరవ్ ఉప్పల్, ఈడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
