మీ పాలన వైఫల్యాలపై స్టడీ చేయించుకో

మీ పాలన వైఫల్యాలపై స్టడీ చేయించుకో
  • కేటీఆర్‌‌‌‌కు మంత్రి దామోదర సూచన

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఎంతలా నాశనమైందో స్టడీ చేయించుకోవాలని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. పేదలకు వైద్యం అందించే గాంధీ హాస్పిటల్‌‌పై బురద జల్లడం మానుకోవాలని పదే పదే చెబుతున్నా.. కేటీఆర్ బుర్రకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. గాంధీ హాస్పిటల్‌‌లో 2022లో సగటున 42 మాతా, శిశు మరణాలు జరిగితే, 2023లో సగటున 45 జరిగాయని, ఈ ఏడాది తొలి 8 నెలల్లో సగటున 39 మాతా, శిశు మరణాలు జరిగాయని మంత్రి వెల్లడించారు.

ఆధారాలతో సహా వివరాలను బయటపెట్టిన తర్వాత కూడా, కమిటీల పేరిట డ్రామాలు చేయడం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. గాంధీ వంటి ప్రభుత్వ దవాఖాన్లపై కుట్రలు చేస్తే ఊరుకునేలేదని హెచ్చరించారు. తొలుత బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో జరిగిన ఘోరాలపై ఫాక్ట్ ఫైండింగ్ చేయాలని కేటీఆర్‌‌‌‌కు సూచించారు. 2017లో కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో మూడు రోజుల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజుల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్‌‌ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు చనిపోయారని మంత్రి గుర్తు చేశారు. అలాగే, 2019లో జూన్, జులై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోయారని మంత్రి గుర్తు చేశారు. తొలుత వాటిపై కమిటీలు వేసుకోవాలన్నారు.

మెడికల్​ కాలేజీల్ని గాడిన పెడుతున్నం

సిబ్బందిని రిక్రూట్‌‌మెంట్ చేయకుండా హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలను గత సర్కార్ నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. ‘‘మూడేండ్లలో హడావుడిగా 25 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారన్నారు. ఈ 25 కొత్త కాలేజీలకు 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారు. అన్ని కాలేజీల్లో కలిపి 19,530 పోస్టులు మంజూరైతే, 1,500 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్‌‌కు దక్కుతుంది” అని మంత్రి విమర్శించారు. తమ సర్కార్ ఏర్పడ్డాక 7,608 పోస్టులను భర్తీ చేశామని, మరో 5,660 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకో 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి తెలిపారు.