నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతు సాహసం

నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతు సాహసం

అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నిజంగా తనకు కావాలని ఉంటే.. ఆ వస్తువు లేదా పని కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి సంఘటనే గుజరాత్ లో జరిగింది. తీవ్ర నీటి సంక్షోభంతో అల్లాడుతున్న అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే గుజరాత్ లోని దాంగ్ గ్రామానికి చెందిన 60ఏళ్ల గంగాబాయి పవార్ అనే ఓ రైతు.. ఈ సమస్యను తీర్చుకునేందుకు బావిని తవ్వించాలని అనుకున్నాడు. కానీ అప్పటికే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ రైతు కుటుంబం... దానికి కావల్సిన సొమ్ము కోసం.. ఆ గ్రామ సర్పంచ్ ని సహాయం అడిగారు. కానీ వాళ్లు అనుకున్న ప్లాన్ అంతా బెడిసికొట్టింది. సాయం చేయమని అడిగిన చేతుల్నే అదనంగా రూ.60,000 ఇవ్వాలని ఆ సర్పంచ్ డిమాండ్ చేశాడు. దీంతో ఏం చేయలేని దీనస్థితిలో ఉన్న ఆ రైతుకు ఓ ఆలోచన వచ్చింది.

ఆ ఆలోచన ఏంటంటే... తానే బావిని తవ్వాలని. చేతిలో రూ.100 కూడా లేని ఆ రైతును.. ఏకంగా రూ.60,000 అడిగేసరికి ఈ ఆలోచనను అమలు చేసేందుకు సమాయత్తం అయ్యాడు. అనుకున్నదే తడవుగా... ఆ ఊరి కోసం నీటి బావిని తవ్వడం మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నంలో బావిని తవ్వుతుండగా అన్నీ రాళ్లు ఎదురయ్యాయని... రెండో ప్రయత్నంలో నీళ్లు కనిపించాయని ఆ రైతు చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 1.5సంవత్సరాలు పట్టిందని స్పష్టం చేశాడు.