బాంబులతో విరుచుకుపడ్తున్న రష్యా

బాంబులతో విరుచుకుపడ్తున్న రష్యా
  • ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ బలగాలు 
  • మరో రెండు జెట్ లు కూల్చివేత 
  • ఇప్పటిదాకా 9,200 మంది రష్యన్లు హతం: ఉక్రెయిన్

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య వరుసగా తొమ్మిదో రోజు కూడా శుక్రవారం భీకర యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ లోని పలు సిటీలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్ సిటీతో సహా చెర్నిహివ్, ఖార్కివ్, ఖేర్సన్, మైకోలైవ్ నగరాలపై దాడులు తీవ్రం చేసింది. కీవ్ లోకి రష్యన్ బలగాలు ఎంటర్ కాకుండా ఉక్రెయిన్ సోల్జర్లు, వాలంటీర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో శుక్రవారం కూడా రష్యన్ బలగాలు సిటీలోని ఇండ్లు, బిల్డింగులపై బాంబుదాడులు చేశాయి. ఉత్తరాదిన ఉన్న చెర్నిహివ్ సిటీపై తెల్లవారుజామున క్లస్టర్ బాంబును ప్రయోగించింది. ఇదే సిటీపై గురువారం ప్రయోగించిన క్లస్టర్ బాంబు వల్ల 47 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. మరియూపొల్ సిటీపైనా రష్యా దాడులు కొనసాగించింది. జపోరిజియా అణువిద్యుత్ కేంద్రాన్నీ రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి విజయం సాధించేదాకా యుద్ధం కొనసాగించాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గురువారం నిర్ణయించడంతో రష్యన్ బలగాలు దాడులు పెంచాయి. ప్రధానంగా ఖేర్సన్ కు దగ్గరగా ఉన్న మైకోలైవ్ సిటీ నుంచి ఒడెస్సా సిటీకి రోడ్డు మార్గాన్ని బ్లాక్ చేయాలన్న ఉద్దేశంతో రష్యన్ సోల్జర్లు విరుచుకుపడ్డారు. అలాగే డాన్ బాస్ ఏరియాలోని ఉక్రెయిన్ సోల్జర్లను ఇతర ప్రాంతాలతో కట్ ఆఫ్ చేసేలా.. మరియూపోల్ సిటీపైనా రష్యా బాంబుల వర్షం కురిపించింది. అజోవ్ సముద్రం వద్ద ఉన్న పోర్ట్ పట్టణం మరియూపోల్ ను చుట్టుముట్టి బాంబుదాడులు చేస్తుండటంతో సిటీలో కరెంట్ సప్లై ఆగిపోయి చీకట్లు అలుముకున్నాయి. సిటీకి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. 

9,200 రష్యన్లు హతం.. 
ఉక్రెయిన్ బలగాలు కూడా ఎక్కడికక్కడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. శుక్రవారం వోల్నోవఖా సిటీ సమీపంలో రష్యాకు చెందిన రెండు జెట్ ఫైటర్లను ఉక్రెయిన్ సోల్జర్లు కూల్చేశారు. హాస్టోమెల్, బ్రోవరీ సిటీల వద్ద పలు యుద్ధట్యాంకులను పేల్చివేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున రష్యన్ సోల్జర్లు చనిపోయారని, అనేక వెహికల్స్ ధ్వంసం అయ్యాయని చెప్తున్నారు. ఇప్పటివరకూ 9,200 మంది రష్యన్ సోల్జర్లను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. వందలాది యుద్ధట్యాంకులను, దాదాపు వెయ్యి ఆర్మర్డ్ వెహికల్స్ ను, పదులకొద్దీ హెలికాప్టర్లు, జెట్​లను పేల్చివేశామని వెల్లడించింది.  

300 మిసైల్స్ తో 280 ట్యాంకులు ఔట్ 
అమెరికా 2018లో అందించిన జావెలిన్ మిసైల్స్ ఉక్రెయిన్ బలగాలకు ఇప్పుడు బాగా కలిసి వస్తున్నయి. జవాన్లు భుజాలపై మోసుకుపోతూ ట్యాంకులను పేల్చేసే వీలుండటం తో వీటిని యుద్ధంలో బాగా ఉపయోగిస్తున్నారని అమెరికన్ జర్నలిస్టు జాక్ మర్ఫీ చెప్పారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ సైనికులు 300 మిసైల్స్ ప్రయోగించి.. 280 రష్యన్ యుద్ధట్యాంకులను పేల్చేశారని తెలిపారు. జావెలిన్ మిసైల్స్ 93% కిల్ రేట్​ను సాధించాయన్నారు. ట్యాంకుల పైభాగం నుంచి దాడిచేయడంవల్లే ఈ మిసైల్స్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందన్నారు.