Danger health alert: విజృంభిస్తోన్న మధుమేహం.. 10 కోట్లు దాటిన రోగుల సంఖ్య

Danger health alert: విజృంభిస్తోన్న మధుమేహం.. 10 కోట్లు దాటిన రోగుల సంఖ్య

దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 101 మిలియన్లు అంటే 10 కోట్లకు పైగా మంది షుగర్ పేషంట్లు ఉన్నట్టు ఐసీఎంఆర్ (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడించింది. 2019లో ఈ సంఖ్య 70 మిలియన్లు ఉండగా.. నాలుగేళ్లలో 100 మిలియన్లు దాటడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ అధ్యయన ఫలితాలను లాన్సెట్ (Lancet) మెడికల్ జర్నల్‌ ప్రచురించింది. కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఈ బాధితుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో భారీ రేటుతో పెరుగుతుండటం తక్షణమే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి.

‘గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్‌లలో మధుమేహ కేసులతో పోలిస్తే ప్రీ-డయాబెటిస్ కేసులు తక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీలలో ఒకే రకమైన పెరుగుదలను కలిగి ఉన్నాయి. మధుమేహం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రీ-డయాబెటిస్ బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రంజిత్ మోహన్ అంజన అన్నారు.

ప్రీ-డయాబెటిక్ అంటే..

రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండడమే ప్రీ డయాబెటిక్ అంటే. అయితే మనకు తెలిసిన టైప్-2 డయాబెటిస్‌గా పరిగణించబడేంత ఎక్కువగా ఉండదు. జీవనశైలిలో మార్పులు లేకుండా ప్రీ-డయాబెటిస్ ఉన్న పెద్దలు, పిల్లలకు మధుమేహం దీని వల్ల ముప్పు ఉంది. ప్రీ-డయాబెటిస్ ఎలా మధుమేహంగా మారతాయో చెప్పలేని చోట వైద్యులు థర్డ్స్ రూల్‌ను పాటిస్తున్నారు. ‘ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో మూడింట ఒక వంతు మందికి కొన్ని సంవత్సరాలలో మధుమేహం వస్తుంది.. మరో మూడింట ఒక వంతు మంది ప్రీ-డయాబెటిక్ ఉండవచ్చు.. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, వ్యాయామంతో సహా వివిధ కారణాల వల్ల మిగతవారు పరిస్థితిని తిప్పికొట్టవచ్చు’ అని సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి మోహన్ అన్నారు.

తాజాగా వెల్లడైన ఈ అధ్యయనంలో 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబరు 17 మధ్య గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన లక్ష మందికి పైగా ప్రజలను పరీక్షించారు. 2019 నాటి సర్వేలో 74 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ఈ పరిశోధనలో తేలింది. రెండేళ్ల తర్వాత తక్కువ-ప్రాబల్యం ఉన్న ఈశాన్య రాష్ట్రాల పరిస్థితులను కలిపితే 72 మిలియన్లకు పడిపోయింది. ఈసారి మాత్రం తాము 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధ్యయనం చేపట్టామని, ఫలితాలను క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ మోహన్ చెప్పారు.