మూసీ నదిలో ప్రమాదకర స్థాయిలో కోలిఫాం బ్యాక్టీరియా

మూసీ నదిలో ప్రమాదకర స్థాయిలో కోలిఫాం బ్యాక్టీరియా

హైదరాబాద్, వెలుగు: మూసీలో కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. నది తీర ప్రాంతంలో భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే కోలిఫాం బ్యాక్టీరియా లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయాయి. మూసీతో పాటు మానేరు, గోదావరి, మంజీర వంటి ఇతర నదులూ కాలుష్యం బారిన పడుతున్నాయి. రాష్ట్రంలోని నదీ జలాల క్వాలిటీపై తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీఎస్​పీసీబీ) ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మూసీ ప్రవహిస్తున్న నాగోల్ ఏరియాలో ఎక్కువగా ఈ ఏడాది జూన్ లో 100 మిల్లీలీటర్ల నీటిలో 1600 ఎంపీఎన్ కోలిఫాం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ నీటిలో ఆక్సిజన్(డీఓ) పర్సంటేజీ, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు ఈ రిపోర్టులో వెల్లడైంది. రాష్ట్రంలో నదీ జలాల క్వాలిటీని పరిశీలించేందుకు గండిపేట, నాగోల్, ప్రతాప్ సింగారం, కాసానిగూడ(మూసీ), వాడపల్లి(కృష్ణా), గౌడిచెర్ల (మంజీర), గండిలచ్చపేట, సేవాలాల్ తండా(నక్కవాగు), పాల్వంచ(కరకవాగు, కిన్నెరసాని), కరీంనగర్ మున్సిపల్ డంప్ సైట్, సోమన్‌‌పల్లి(మానేరు), మంచిర్యాల, బాసర(గోదావరి) తదితర చోట్ల ఉన్న నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం(ఎన్ డబ్ల్యూఎంపీ) స్టేషన్ల ద్వారా డేటాను సేకరించారు.    

వికారాబాద్‌‌‌‌ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టే మూసీ నది 95 కి.మీ. ప్రవహించి బాపూఘాట్‌‌‌‌ వద్ద నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాప్ సింగారం వరకు సిటీలో 44 కి.మీ. మేర నది ప్రవహిస్తోంది. సిటీలోకి ప్రవేశించాక ఇండస్ట్రీలు, షాపులు, ఇండ్ల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు నదిలో కలవడంతో మూసీ మురికి కూపంగా మారిపోతోంది. గండిపేట ఉస్మాన్ సాగర్ వద్ద లీటర్ నీటిలో బీఓడీ1.2 మి.గ్రా., ఆక్సిజన్ 6 మి.గ్రా., 100 మిల్లీలీటర్ల నీటిలో కోలి ఫాం 63 ఎంపీఎన్ (మోస్ట్ ప్రాబబుల్ నెంబర్)గా నమోదైంది. అదే నాగోల్ ఏరియాకు వచ్చేసరికి లీటర్ నీటిలో బీఓడీ 29 మి.గ్రా., ఆక్సిజన్ 0.3 మి.గ్రా., 100 మిల్లీ లీటర్ల నీటిలో​ కోలిఫాం1600 ఎంపీఎన్ ఉన్నట్లు తేలింది. సిటీలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల నుంచి మూసీ నదిలోకి వదులుతున్న వ్యర్థాల వల్లే ఈ స్థాయిలో కలుషితం అవుతున్నట్లు తెలుస్తోంది. సిటీ వ్యర్థాలతో భయంకరమైన కాలుష్యాన్ని మోసుకెళ్తున్న మూసీ నది దిగువన ఉన్న నల్లగొండ జిల్లాలో రైతులు పండించే పంటలను, తాగే నీరును కలుషితం చేస్తోంది.   

మానేరు, గోదావరి కూడా.. 

మూసీలాగే మానేరు నది కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కరీంనగర్ మున్సిపల్ డంప్ సైట్ లోని ఎన్ డబ్ల్యూఎంపీ స్టేషన్ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్​లో మానేరు నీటిలో 100 మిల్లీలీటర్లకు 920 ఎంపీఎన్ కోలిఫాం ఉన్నట్లు వెల్లడైంది. మున్సిపల్ కార్పొరేషన్ నదీ తీరంలోనే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడంతోపాటు, చికెన్ సెంటర్లు, హోటళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెకానిక్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థల నిర్వాహకులు వ్యర్థాలను మానేరులో వేస్తున్నారు. దీంతో మానేరు కాలుష్యం బారిన పడింది. మైనింగ్ కార్యకలాపాల కారణంగా మంచిర్యాల, -కమలాపూర్, కొత్తగూడెం, భద్రాచలం ఏరియాల్లో గోదావరి జలాలు కూడా కలుషితం అవుతున్నట్లు పీసీబీ గుర్తించింది.   మూసీ జలాల్లో ఎక్కువ మోతాదులో కనిపిస్తున్న కోలిఫాం బ్యాక్టిరీయా కార ణంగా జనాలకు వాంతులు, జ్వరం, డయేరియా, కామెర్లు, తలనొప్పి, అలసట లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బావి, బోరు బావి నుంచి భూగర్భ జలాలను తాగునీటిగా వినియోగించే వాళ్లకు ఈ బ్యాక్టీరియాతో ప్రమాదం ఎక్కువ.  

కాగితాల్లోనే మూసీ ప్రక్షాళన 

మూసీ సుందరీకరణ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోర్డు వేసినా పనులు మాత్రం చేపట్టడం లేదు. నాలుగేళ్లుగా అధికారులు అరకొర నిధులు, తాత్కాలిక పనులతో నెట్టుకొస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు గతంలో రూ.2 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఆ నిధులతో చేపట్టిన నిర్మాణాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి.  

సమగ్ర విధానం అవసరం 

నదీ జలాల కాలుష్యానికి కారణమైన అంశాలను సైంటిఫిక్ గా గుర్తించి చర్యలు చేపట్టాలి. పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో కలవకుండా చూడాలి. భూమి, నీరు, సరస్సు, నది ఒకదానితో ఒకటి లింకయి ఉన్నాయి. నదీ జలాల కాలుష్యాన్ని మాత్రమేగాక, భూగర్భ జలాల కాలుష్యాన్ని పరిష్కరించడానికి కూడా ఒక సమగ్ర విధానం ప్రభుత్వానికి అవసరం.  

- ప్రొఫెసర్ దొంతి నర్సింహా రెడ్డి, పబ్లిక్ పాలసీ ఎక్స్ పర్ట్