కాంగ్రెస్​ను రేవంత్ రాబరీ పార్టీగా మార్చిండు

కాంగ్రెస్​ను రేవంత్ రాబరీ పార్టీగా మార్చిండు
  •     రేవంత్​పై దాసోజు శ్రవణ్ ఫైర్​​
  •     కాంగ్రెస్​ను ఆయన మాఫియాలా నడుపుతున్నడు 
  •     పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్నడు
  •     రేవంత్, మాణిక్కం ఠాగూర్, సునీల్ కుమ్మక్కయ్యారు
  •     పార్టీలో చాలా మంది ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నరు
  •     అవమానం తట్టుకోలేను.. ఆత్మగౌరవం కోసం వెళ్తున్న..
  •     మాఫియాలా పార్టీని నడుపుతున్నడు: శ్రవణ్
  •     కాంగ్రెస్​ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ను పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి రాబరీ(దోపిడీ) పార్టీగా మార్చారనీ, మాఫియాను నడిపినట్లు పార్టీని నడుపుతున్నారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీని తెచ్చుకొని సొంత కంపెనీలా పీసీసీని మార్చేశారన్నారు. కాంగ్రెస్​ను ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీ చేశారన్నారు. ఛీర్ గ్యాంగ్​తో చప్పట్లు, సీటీలు, పటాకులతో లీడర్​ అయిపోయాననుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్​ను నామరూపం లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. దాసోజు తన ఆఫీసులో శుక్రవారం ప్రెస్​మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. “పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన నుంచి కాంగ్రెస్​లో కులం, ధనం ప్రధానం అయినయ్. అరాచకం పెరిగింది. పార్టీని డీలర్ షిప్ తెచ్చుకున్నట్లు నడుపుతున్నరు. కష్టాల కోర్చి కాంగ్రెస్​లో ఇంత కాలం పని చేసిన, ఏడాది నుంచి అవమానాలు ఎదుర్కొంటున్న, ఇంక ఆత్మగౌరవాన్ని చంపుకోలేను’’ అని అన్నారు.

హైకమాండ్​కు తప్పుడు సర్వే రిపోర్టులు

2014లో అధికారంలోకి రాదని తెలిసి కూడా కాంగ్రెస్​లో చేరానని శ్రవణ్ అన్నారు. కాంగ్రెస్​తోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, సామాజిక న్యాయ సూత్రాన్ని అనుసరిస్తారని పార్టీలోకి వచ్చానన్నారు. నిజానికి కాంగ్రెస్​ సిద్ధాంతమే అది అన్నారు. కానీ ఇప్పుడు అవేవి లేవన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ లీడర్లకు అవమానాలు ఎదురవుతున్నాయనీ, ప్రశ్నించిన వాళ్లను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అధిష్టానానికి చెప్పుకునే అవకాశం ఉండేదనీ, కానీ ఇపుడా పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్​ ఇన్​ఛార్జి మణిక్కం ఠాగూర్, సునీల్ కనుగోలు రేవంత్​తో కుమ్మక్కయ్యారని అన్నారు. ఈ ముగ్గురు కలిసి పార్టీని భ్రష్టు పట్టించారని తెలిపారు. పార్టీ వీడటానికి గల కారణాలను నాలుగు పేజీల లేఖ ద్వారా సోనియా గాంధీకి వివరించారు. బానిస లాగా బతకలేక పార్టీ మారుతున్నానన్నారు. పీసీసీ చీఫ్ స్థాయిలో రెడ్లకు అనుకూలంగా మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలను లీడర్లు కాకుండా చూస్తున్నారన్నారు. వాళ్లను బానిసల్లాగే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. దీనిని  సహించలేక పార్టీకి వీడుతున్నానని ప్రకటించారు.

కాంగ్రెస్ నేతల చర్చల విఫలం

శ్రవణ్ మీడియాతో మాట్లాడనున్నట్లు ప్రకటించగానే కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి దాసోజుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవటంతో పార్టీ మారొద్దని వీడియో విడుదల చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నేతలు  కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి.. శ్రవణ్ ఆఫీస్ కు వచ్చి పార్టీ మారొద్దని చర్చలు జరిపారు. రాజీనామా చేస్తున్నట్లు నేతలకు శ్రవణ్ స్పష్టం చేయటంతో నేతలు వెనుతిరిగారు.

రాహుల్​కు చెప్పినా ప్రయోజనం లేదు

పీసీసీకి తానే ఓనర్ లా రేవంత్ ఫీల్ అవుతున్నాడని శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ ఎవరికీ అందుబాటులో ఉండడని, కలవటానికి వెళ్తే గంటల పాటు వెయిట్ చేసి వెనుదిరగాల్సి ఉంటుందన్నారు. పార్టీలో చాలా మంది బాధపడుతున్నారని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారన్నారు. రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం అడియాశేనని తెలిపారు. ఆయన పార్టీని నడిపే తీరుపై చాలా సార్లు హైకమాండ్​కు ఫిర్యాదు చేశానన్నారు. రాష్ట్ర పార్టీ నేతల సమావేశంలో రాహుల్ గాంధీకి 4 గంటల పాటు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.