నిజాంను మించిన నీచ పాలన

నిజాంను మించిన నీచ పాలన

మంచి పాలకుడి పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడస్తుందని విన్నాం. కానీ తెలంగాణలో ఉద్యమ లక్ష్యాలకు విరుద్ధంగా అణివేత, ఆధిపత్యం, అహంకారం, అవినీతి అనే నాలుగు పాదాల మీద కేసీఆర్ పాలన నడుస్తోంది. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు కూడలిగా ఉన్న ధర్నా చౌక్ ను కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎత్తేశారు. ధర్నాలు చేస్తే పోలీసులను పెట్టి కొట్టిస్తున్నరు. మావోయిస్టు ఎజెండానే తన ఎజెండా అని ఉద్యమ సమయంలో ప్రకటించిన కేసీఆర్.. అధికారంలో రాగానే శృతి, విద్యాసాగర్ రెడ్డి, వివేక్ ను ఎన్ కౌంటర్ పేరిట హత్య చేశారు. తెలంగాణ ఉద్యమంలో కలమెత్తిన, గళమెత్తిన వరవరరావు లాంటి విప్లవ కవులను అరెస్ట్ చేస్తే సీఎం కేసీఆర్ మౌనం వహించారు. పైగా తెలంగాణ కోసం లాఠీచార్జీలు, జైలు నిర్బంధాలకు వెరవకుండా మిలిటెంట్ పోరాటాలు చేసిన తెలంగాణ విద్యార్థి వేదిక, పౌర హక్కుల సంఘం, విరసం, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర 18 ప్రజాసంఘాలను నిషేధించిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ సొమ్ముతో తన, తన కుటుంబ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం సంతలో గొడ్లను కొన్నట్లుగా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను, నేతలను కొనేశారు. 

రబ్బర్ స్టాంపులుగా మంత్రులు
ప్రభుత్వ నిర్ణయాలను తాను తప్ప వేరొకరు ప్రకటించొద్దనే అహంకారం కేసీఆర్ లో ఉంది. దీంతో మంత్రులు రబ్బర్ స్టాంప్ లుగా మారిపోయారు. మొదటి కేబినేట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్య.. వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించడం నేరమైపోయింది. కొన్నాళ్లకే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. తాజాగా ఈటల రాజేందర్ కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. మంత్రులనే కాదు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పని చేసిన గాదె ఇన్నయ్య, దేశిని చిన్నమల్లయ్య, ఆలె నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్ నుంచి నా వరకు సుమారు 30 మందిని పక్కకు తప్పించారు.

మాఫియా రాజ్యం
2014 నుంచి ఇప్పటిదాకా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ఆస్తులు 500 రెట్లు పెరిగాయి. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వందల కోట్లు, ఫామ్ హౌజులు సంపాదించారు. గ్యాంగ్ స్టర్ నయీం కంటే ఎక్కువగా, నీచమైన పద్ధతిలో భూములు కబ్జా చేస్తున్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా అన్నింట్లోనూ టీఆర్ఎస్ పెద్దల హస్తం ఉంటోంది. చివరికి నయీంను చంపి అతడి ఆస్తులను కూడా కాజేశారు.

కట్టినవి కొన్ని.. వాటికీ బీటలు
2014లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 22 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అన్ని ఇళ్లు ఎప్పటికి కడతారో క్లారిటీ లేదు. కొన్ని ఇళ్లు కట్టినా ప్రజలకు ఇవ్వడం లేదు. కొన్ని ఇప్పటికే బీటలు వారి కూలిపోతున్నాయి. సీఎం కేసీఆర్ అయితే ఫామ్ హౌజ్ లో ఇల్లు కట్టుకున్నడు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ కట్టుకున్నడు. కానీ ప్రజలకు మాత్రం ఇళ్లు కట్టివ్వడం లేదు. దళితులకు మూడెకరాల భూమి ఇప్పటికే అటకెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

4 వేల స్కూళ్ల మూత
ఏడేళ్లలో 4 వేల గవర్నమెంట్ స్కూళ్లను మూసేశారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అరికడతామని చెప్పి.. ఇప్పుడు శ్రీచైతన్య, నారాయణ లాంటి సంస్థలతోనే మిలాఖతై వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లాకో నిమ్స్ స్థాయి హాస్పిటల్ కట్టిస్తామని, నియోజకవర్గానికో 100 పడకల హాస్పిటల్, మండలానికో 30 పడకల హాస్పిటల్ నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. సగం డాక్టర్లు, నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

విముక్తి కావాలె
‘ఎందుకు తెచ్చుకున్నం తెలంగాణ’ అని రాష్ట్ర ప్రజలు ఇవ్వాళ బాధపడుతున్నారు. ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడినమో వాళ్లే మన నెత్తిన ఎక్కి స్వారీ చేస్తున్నారు. పరిపాలనలో, కాంట్రాక్టుల్లో ఆంధ్రా నాయకత్వం, ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో బందీ అయిపోయింది తెలంగాణ. నిజాం పరిపాలన కంటే నీచమైన పాలనను సాగిస్తున్నారు. నియంత పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తిని కోరుకుంటోంది. 

అమరవీరులకు సాయమేదీ?
తెలంగాణ సాధన కోసం 1,500 మంది అమరవీరులు ప్రాణాలు వదిలారని పార్లమెంట్, అసెంబ్లీ సాక్షిగా కేసీఆరే చెప్పారు. కానీ వాళ్లలో కనీసం 500 మందికి కూడా రూ.10 లక్షల సాయం అందజేయలేదు. మూడెకరాల భూమి ఇవ్వలేదు. 1969 ఉద్యమంలో హైదరాబాద్ లోనే సుమారు 400 మంది చనిపోయారు. అప్పటి ఉద్యమకారులను ఏనాడూ కేసీఆర్ సత్కరించలేదు. 5 లక్షల కోట్లు విలువజేసే వక్ఫ్​బోర్డు భూములను టీఆర్ఎస్ మంత్రులు, నేతలు, ఎంఐఎం లీడర్లు కబ్జా చేస్తున్నారు. 25 వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్లు కాగ్ నివేదికలో చెప్పినా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదు. తమ రాజకీయాల కోసం ఈటల రాజేందర్ మీద ప్రభుత్వ పెద్దలు కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటూ కేసుల పాలైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి వంటి వాళ్లు జిల్లాలవారీగా కుప్పలు తెప్పలుగా ఉన్నారు.

- దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి