అల్లు అర్జున్‌‌తో కలిసి రీల్ చేయాలని ఉంది: డేవిడ్ వార్నర్

అల్లు అర్జున్‌‌తో కలిసి రీల్ చేయాలని ఉంది: డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్.. ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడు.. ఒంటి చేత్తో విజయాలందించగల సమర్థుడు. ఇది ఒకవైపు నాణెం మాత్రమే. అతనిలో మరో కళ కుడా ఉంది. అదే రీల్స్ చేయడం. సినిమాల్లోని ఫేమస్ క్యారెక్టర్లకు తన ముఖాన్ని జోడించి రీల్స్ చేయడంలో వార్నర్ మంచి దిట్ట. ఇప్పటివరకూ బాహుబలి, డీజె టిల్లు, పుష్ప, ఆర్‍ఆర్‍ఆర్ వంటి పలు క్యారెక్టర్లకు తన ముఖాన్ని జోడించాడు వార్నర్.

తాజాగా ఓ బ్రాడ్ కాస్టర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వార్నర్ కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అందులో క్రికెట్ గురుంచి కొన్నైతే.. తన ఇష్టాల గురుంచి మరికొన్ని. క్రికెట్ కెరీర్‌లో తనకు స్ఫూర్తి నింపిన అత్యత్తమ క్రికెటర్ ఎవరు అని హోస్ట్ అడగ్గా.. ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ పేర్లు చెప్పాడు. ఇక క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఫినిషర్ ఎవరు అన్న ప్రశ్నకు వార్నర్ క్షణం ఆలోచించకుండా ధోనీ పేరు చెప్పాడు. "నా వరకూ ఎంఎస్ ధోనీ.." అని ఠక్కున చెప్పాడు.

అల్లు అర్జున్‌తో రీల్ చేయాలని ఉంది

ఇదే ఇంటర్వ్యూలో వార్నర్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ రీల్ చేయాలని ఉందని చెప్పడం గమనార్హం. నిజానికి అల్లు అర్జున్‌ని ఇమిటేట్ చేస్తూ వార్నర్ గతంలో ఎన్నో రీల్స్ చేశాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న సమయంలో సోషల్ మీడియాలో అతని హడావుడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ హీరోల్లా రీల్స్ చేసేవాడు. అందునూ అతను చేసిన పుష్ప క్యారెక్టర్ మరో లెవెల్ అని చెప్పుకోవాలి. అల్లు అర్జున్‌తో కలిసి రీల్ చేయాలన్న అతని కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

హోస్ట్ అడిగిన ప్రశ్నలు- వార్నర్ సమాధానాలు

క్రికెట్ ఆడేందుకు మిమ్మల్ని ప్రేరేపించిన క్రికెటర్ ఎవరు?

  • షేన్ వార్న్, రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్. 

క్రికెట్ హిస్టరీలో గోట్ (G.O.A.T) ఎవరు?

  • జాక్వెస్ కల్లిస్.

అంతర్జాతీయ క్రికెట్‌లో మీకు ఇష్టమైన ఇన్నింగ్స్ ఏది?

  • 2019లో అడిలైడ్‌లో పాకిస్థాన్‌పై (335 నాటౌట్).

క్రికెట్ చరిత్రలో గొప్ప ఫినిషర్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు?

  • ఎంఎస్ ధోని.

మీ క్రికెట్ కెరీర్‌లో మీ గొప్ప క్షణం?

  • 2015 ప్రపంచకప్‌ గెలవడం.

మీరు రీల్ చేయాలనుకుంటున్న ఒక సినీ నటుడు ఎవరు?

  • అల్లు అర్జున్.

మీరు బ్యాటింగ్ ప్రారంభించాలనుకునే ఒకప్పటి క్రికెటర్.

  • ఇద్దరున్నారు.. వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, టెస్ట్ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ లేదా మాథ్యూ హేడెన్.

నువ్వు క్రికెటర్ కాకపోతే ఏమై ఉండేవాడివి?

  • వ్యోమగామి(ఆస్ట్రోనాట్).

మీరు తినడానికి ఇష్టపడే భారతీయ వంటకం ఏది?

  • హైదరాబాదీ బిర్యానీ.