Teens Covid Vaccine: 36 గంటల్లో 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్‌

Teens Covid Vaccine: 36 గంటల్లో 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్‌

టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభమైంది. కొవిన్ వెబ్‌సైట్‌లో 15 ఏళ్ల నుంచి 18ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కేవలం 36 గంటల్లోనే ఆదివారం మధ్యాహ్నం వరకు 4.5 లక్షల మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇప్పటి వరకు 145.52 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు పేర్కొంది. ఇందులో మొదటి డోసు 84.73 కోట్లు, రెండో డోసు 60.79 కోట్లు ఉన్నట్లు తెలిపింది. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు అన్ని ఏజ్ గ్రూప్‌లలో వాళ్లు కలిపి 92.23 కోట్ల మంది కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఇందులో 18 నుంచి 44 ఏండ్ల మధ్య వాళ్లు 57.39 కోట్ల మంది, 45 ఏండ్ల పైబడిన వాళ్లు 34.78 కోట్ల మంది ఉన్నారని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పిల్లలకు కొవాగ్జిన్ టీకా మాత్రమే వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లో మరో రెండు వ్యాక్సిన్లు పిల్లలకు వేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

కాగా, జనవరి 3 నుంచి 15 – 18 ఏండ్ల మధ్య వయసు వారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు గత వారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్‌ కోసం టీనేజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించారు. జనవరి 10 నుంచి ఫ్రంట్‌ లైన్ వారియర్లు, హెల్త్ సిబ్బంది, 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోసు వేయనున్నట్లు చెప్పారు. కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.