DC vs CSK: ధోని మెరుపులు వృథా.. ఢిల్లీ చేతిలో చెన్నై ఓటమి

DC vs CSK: ధోని మెరుపులు వృథా.. ఢిల్లీ చేతిలో చెన్నై ఓటమి

విశాఖ వేదికగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్  ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నై 171 పరుగులకే  పరిమితమైంది. దీంతో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

7 పరుగులకే 2 వికెట్లు

192 పరుగుల భారీ ఛేదనకు దిగిన చెన్నైకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర(2), రుతురాజ్ గైక్వాడ్(1) లను ఖలీద్ అహ్మద్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో సీఎస్కే 7 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అజింక్యా రహానే(45), డారిల్ మిచెల్(34) జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని అక్సర్ పటేల్ విడగొట్టాడు. 

అక్కడినుంచి చెన్నై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది.  చివరలో ధోని(37 నాటౌట్; 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు), జడేజా(21 నాటౌట్) కాసేపు పోరాడారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్ తన 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.  

ఆదుకున్న పంత్

అంతకుముందు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(52; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషబ్ పంత్(51; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలు బాదగా.. పృథ్వీ షా(43; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ప‌రుగులు చేశాడు.