- డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు
 
కామారెడ్డి టౌన్, వెలుగు: భారీ వర్షాల వల్ల జరిగిన కామారెడ్డి జిల్లా విపత్తుపై రాజకీయాలు చేయొద్దని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ జిల్లా ఆఫీస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో విపత్తులు జరిగాయని, అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వర్షాలపై కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టిందన్నారు.
సీఎం స్వయంగా హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే కోసం వచ్చినప్పటికీ, వాతావరణం అనుకూలించలేదని చెప్పారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, కాంగ్రెస్ కార్యకర్తలు, షబ్బీర్ అలీ ఫౌండేషన్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. నిరాశ్రయులకు కల్యాణ మండపాల్లో నివాసం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ పట్టణంలో 3 వేల మందికి, మండలాల్లో 2 వేల మందికి అన్నదానం చేస్తున్నామన్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికిరూ.11,500 ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఎమ్మెల్సీల బృందం, అధికారులు, నాయకులు, మంత్రులు సర్వేలు నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచారన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించినందుకు కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, కాంగ్రెస్జిల్లా ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, సబ్బని శంకర్, సర్వర్, కిరణ్, సిద్ధిక్, లక్కపతి తదితరులు పాల్గొన్నారు.
