ఎద్దులతో వెళ్తున్న వ్యాన్.. అడ్డుకున్న పోలీసులు

ఎద్దులతో వెళ్తున్న వ్యాన్.. అడ్డుకున్న పోలీసులు
  • రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం హిమాయత్ నగర్ వద్ద ఘటన

రంగారెడ్డి జిల్లా: ఎద్దులతో వెళుతున్న డీసీఎం వ్యాన్ ను స్థానికులు  అడ్డుకున్న ఘటన మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో ఆదివారం జరిగింది. నారాయణపేట జిల్లా కోసిగి నుంచి హైదరాబాద్ నగరానికి డీసీఎం వ్యాన్ లో ఎద్దులను తరలిస్తుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హిమాయత్ నగర్ చౌరస్తాలో వాహనాన్ని అడ్డుకున్నారు. ఏపీ 22 ఎక్స్0684 నెంబరు గల డీసీఎం వాహనంలో 9 ఎద్దులను తరలిస్తుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపి వేశారు. ఎద్దులను తరలిస్తున్న వారు అనుమతి పత్రాలు చేయించడంతో వాహనాన్ని పంపించినట్లు సీ.ఐ రాజు తెలిపారు. కాగా ప్రస్తుతం బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఎద్దులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్న సమయంలో రెండు వర్గాలకు చెందిన వారు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింప జేసి ఎద్దులతో వస్తున్న డీసీఎం వ్యానును పంపించివేశారు. ఈ విషయమై విలేకరులు సీఐ రాజును ఫోన్లో సంప్రదించగా ఎద్దులను తరలిస్తున్న వ్యక్తుల వద్ద అనుమతి పత్రాలు, పశువైద్యుల ధ్రువీకరణ పత్రాలతో సహా అన్నింటినీ పరిశీలించామని తెలిపారు.