జ్యోతిష్యం పేరుతో మోసం

జ్యోతిష్యం పేరుతో మోసం

పాలకుర్తి ( కొడకండ్ల ), వెలుగు: జ్యోతిష్యం పేరుతో మోసానికి పాల్పడిన ముఠాను పట్టుకున్నట్లు  డీసీపీ రాజమహేంద్ర నాయక్  తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. కొడకండ్ల ఎస్సీ కాలనీకి చెందిన మహిళకు సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన కడమంచి రజనీకాంత్  మీ ఇంట్లో గుప్తనిధి ఉందని, దీంతో నలుగురు చనిపోయారని నమ్మించాడు. పూజా సామగ్రి పేరుతో మూడు విడతల్లో రూ.17.95 లక్షలు కాజేశారు. 

మరో ఏడు లక్షలు చెల్లిస్తే పూజా సామాను తీసుకొని వచ్చి పూజలు చేస్తామని రజనీకాంత్, సురేశ్, నరసింహ చెప్పారు. వారిపై అనుమానంతో పోలీసులు ఆశ్రయించిన బాధితులు.. సామాను తీసుకొని వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామని బాధిత మహిళ తెలపడంతో మంగళవారం కొడకండ్ల గ్రామానికి నరసింహ, సంపత్ కుమార్  వచ్చారు. వారిని అరెస్ట్​ చేసి రూ.15.47 లక్షల నగదుతో పాటు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రజనీకాంత్, సురేశ్​ పరారీలో ఉన్నారని డీసీపీ చెప్పారు.