శవాన్ని కాల్చరు.. పూడ్చరు.. మరి ఏం చేస్తారు?

శవాన్ని కాల్చరు.. పూడ్చరు..  మరి ఏం చేస్తారు?

మృతదేహాలకు ‘సహజ అంత్యక్రియలు’

డెడ్ బాడీలను కంపోస్టుగా మారుస్తరు

కొత్త ట్రెడిషన్‌‌ స్టార్ట్‌‌ చేయనున్న అమెరికన్‌‌ కంపెనీ

ఈ శరీరంలో ఏముంది సార్? వట్టి మట్టి సార్.. అంతా మట్టే..” ఓ సినిమాలో తన వెంటపడ్తున్న హీరోకు సర్దిచెప్పేందుకు హీరోయిన్ ఇలాంటి డైలాగే చెప్తుంది. ‘‘ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే.. చివరికి ఆరడుగుల నేల ఉంటే చాలుగా..” అని మన పెద్దోళ్లు కూడా వేదాంతం చెప్తుంటరు. అయితే, మనోళ్ల డెడ్ బాడీలు మట్టిలో కలిసిపోవడం కాదు.. వాటినే మట్టిగా మార్చి చేతుల్లో పెడతామంటున్నారు అమెరికాకు చెందిన ‘రీకంపోజ్’ అనే కంపెనీ ఓనర్లు. మరణం  తర్వాత అంత్యక్రియలు చేయడంలో మతాలను, ప్రాంతాలను బట్టి రకరకాల ఆచారాలు, ట్రెడిషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఖననం లేదా దహనంతో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ జనాభా కుప్పలుతెప్పలుగా పెరుగుతున్నది. ఖననం చేస్తూపోతే.. జాగా దొర్కడం కష్టమైపోతది. దహనం చేస్తే బెటరే కానీ.. పొల్యూషన్ మాత్రం తప్పదు. అందుకే.. అటు ఖననం, ఇటు దహనం రెండూ కాకుండా, మృతదేహాలను సహజంగానే పంచభూతాల్లో కలిసిపోయేలా చేస్తామంటున్నారు ‘రీకంపోజ్’ నిర్వాహకులు. ఇందుకోసమే తాము ప్రపంచంలోనే తొలి ‘హ్యూమన్ కంపోస్టింగ్ సెంటర్’ను ప్రారంభించనున్నామని వెల్లడించారు.

డెడ్ బాడీ నెలరోజుల్లో కంపోస్ట్ అయితది.. 

‘‘మీ ఆత్మీయుల మృతదేహాలను మాకు అప్పగించండి చాలు.. వాటిని సహజంగా విచ్ఛిన్నమయ్యేలా చేసి మట్టిలా మారుస్తాం. మీ వాళ్ల శరీరాన్ని కంపోస్ట్ ఎరువుగా మార్చి మీ చేతుల్లో పెడతాం.” అని చెప్తున్నారు రీకంపోజ్ నిర్వాహకులు. రీకంపోజిషన్ లేదా నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మృతదేహాలను సున్నితంగా మట్టి, ఎరువులా మారేలా చేస్తామని వారు చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన ‘హెక్సాగోనల్ రీకంపోజిషన్ వెస్సెల్స్’నే శవపేటికలుగా వాడుతారు. వీటిలో మృతదేహం చుట్టూ కార్బొనేటెడ్ వాటర్ తో తడిపిన కలపముక్కలు ఉంచుతారు. దీంతో మృతదేహాలను సహజంగా విచ్ఛిన్నం చేసి, ఎరువుగా మార్చే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పెద్దమొత్తంలో పెరిగి నెలలో డెడ్ బాడీని కంపోస్ట్ ఎరువుగా మార్చేస్తాయి. ఆ హ్యూమన్ కంపోస్ట్ ను మృతుల బంధువులకు అప్పగిస్తారు. తర్వాత ఆ శవపేటికను మరో మృతదేహాన్ని ఎరువుగా మార్చేందుకు వాడతారు.

2021 నాటికి అందుబాటులోకి..

ఈ కాన్సెప్ట్ పై ఎన్నో ఏండ్లుగా రీసెర్చ్ చేశామని, తాజాగా చట్టబద్ధమైన అడ్డంకి కూడా తొలగిపోయిందని రీకంపోజ్ ఫౌండర్ కత్రినా స్పేడ్ వెల్లడించారు. వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్ నగరంలో 2021 నాటికి  ప్రపంచంలోనే తొలి ‘హ్యూమన్ కంపోస్టింగ్ సెంటర్’ను ప్రారంభిస్తామని తెలిపారు. హ్యూమన్ కంపోస్టింగ్ ను అనుమతించే చరిత్రాత్మకమైన బిల్లును వాషింగ్టన్ స్టేట్ ఇటీవలే ఆమోదించిందని, ఈ బిల్లు2020 మే నుంచి చట్టంగా మారనుందన్నారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైనా తమ ఆత్మీయుల మృతదేహాలను ఇక్కడికి తెచ్చి ‘సహజ అంత్యక్రియలు’ పూర్తి చేయవచ్చని వెల్లడించారు.

మట్టిని తెచ్చి..  మొక్కలు పెంచుకోవచ్చు

మన ఆత్మీయుల మృతదేహం నుంచి తయారైన ఎరువును తెచ్చి, కుండీలో పెట్టి మొక్కను నాటుకోవచ్చు. ఆ మొక్కను ప్రేమతో పెంచుతూ.. మనవాళ్లను ఆ మొక్కలో చూసుకోవచ్చు. ఒక్కో డెడ్ బాడీ నుంచి నాలుగైదు తొట్టెల ఎరువును తయారు చేసి ఇస్తారట. కావాలనుకునే వాళ్లు ఆ మట్టితో ఒక చిన్న తోటను కూడా పెంచుకోవచ్చని అంటున్నారు. భూమిలో పాతిపెట్టడం, కట్టెలు పేర్చి కాల్చడం కన్నా.. ఇలా మన వాళ్ల డెడ్ బాడీలను మట్టిగా మార్చి, పర్యావరణానికి మేలు కలిగించే సరికొత్త ‘సహజ అంత్యక్రియలు’ చేయడమే వాళ్లకు మనమిచ్చే ఘనమైన నివాళి అవుతుందని పేర్కొంటున్నారు. ఇంతకూ ఖర్చెంతవుతుందో చెప్పలేదు కదూ.. ఒక్కో డెడ్ బాడీని కంపోస్ట్ గా మార్చాలంటే 5,500 డాలర్ల వరకూ ఫీజు కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే సుమారుగా రూ. 4 లక్షల వరకూ అవుతుందని అంటున్నారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి